ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందంటూ 10 కేంద్ర కార్మిక సంఘాలు 2020 జనవరి 8న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. కార్మిక వర్గాల డిమాండ్లను పట్టించుకోవడం లేదన్నాయి.
జనవరి 8న దేశవ్యాప్త సమ్మె.. కార్మిక సంఘాల పిలుపు - 10 కేంద్ర కార్మిక సంఘాల సమ్మె పిలుపు
దేశ ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై 10 కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, ఉద్యోగ సంఘాలు సమర శంఖం పూరించాయి. 2020 జనవరి 8న సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే సమ్మెకు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నాయి.
''కార్మిక వ్యతిరేక, యజమాన్య అనుకూల కార్మిక చట్టాల సవరణ, లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి. ప్రైవేటీకరణ ఆపాలి. రైల్వే, రక్షణ, బొగ్గుతో సహా ఇతర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) ఆపాలి. బ్యాంకుల విలీనం తగదు. ప్రజల కొనుగోలు శక్తి పెంచాలి. కనీస వేతనం నెలకు రూ.21 వేలు అమలు చేయాలి. సర్కారు అనుసరిస్తున్న కార్మిక, ప్రజా, జాతీయ వ్యతిరేక విధానాలపై పోరు బాట పడుతున్నాం." - కేంద్ర కార్మిక సంఘాల ప్రకటన
పెరుగుతోన్న ధరలు, నిరుద్యోగంపై కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజాహిత పాలనవైపు అడుగులు వేయాలని.. లేకుంటే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించాయి.
- ఇదీ చూడండి: పసిడి ధర దిగొచ్చింది... 10 గ్రాములెంతో తెలుసా..?