ఆన్‌లైన్ గ్రాసరీ దిగ్గజం బిగ్‌బాస్కెట్‌ను దక్కించుకోవడానికి టాటా డిజిటల్స్‌కు మార్గం సుగమం అయ్యింది. ఈ కొనుగోలుకు భారత కాంపిటిషన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా గురువారం ఆమోద ముద్ర వేసింది. దీంతో టాటా డిజిటల్ సంస్థ సూపర్ మార్కెట్ గ్రాసరీ సప్లైస్ ప్రైవేట్ లిమిటెడ్(ఎస్‌జీఎస్)లో 64.3శాతం వాటాను కొనుగోలు చేయవచ్చు. ఎస్‌జీఎస్ సంస్థ బిగ్‌బాస్కెట్‌ను నియంత్రిస్తున్న ఇన్నోవేటీవ్ రిటైల్ కాన్సెప్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో వాటాలను కొనుగోలు చేయడానికి మార్గం సుగమం అయింది.
అలీబాబాకూ ప్రయోజనం..
టాటా డిజిటల్ ఈ కొనుగోలు పూర్తి చేస్తే.. అలీబాబా సంస్థకు కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ సంస్థ తాజాగా బిగ్‌బాస్కెట్‌లో ఉన్న 29శాతం వాటాలను విక్రయించి ఎగ్జిట్ కావాలని చూస్తోంది. అంతేకాదు.. దేశీయ బిజినెస్ టైకూన్ గోద్రెజ్‌కు కూడా 16.3 శాతం వాటా ఉంది. దాదాపు రూ.9,300 కోట్ల (1.2బిలియన్ డాలర్ల)తో ఈ డీల్ నిర్వహించడానికి టాటా సిద్ధమైంది.