ఎస్ బ్యాంక్ సంక్షోభంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తు ప్రారంభించింది. బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా కపూర్‌పై రెండు(మోసం, అవినీతి) కేసులు నమోదు చేసింది. ఈ కేసులోని పలు కీలక ఆధారాల కోసం సంబంధిత పత్రాలను సేకరిస్తున్నట్లు సమాచారం. అయితే.. బ్యాంక్ సంక్షోభంపై దర్యాప్తు విషయాన్ని గోప్యంగా ఉంచాలని సీబీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
డీహెచ్ఎఫ్ఎల్, ఎస్ బ్యాంక్ మధ్య సంబంధంపై సీబీఐ దర్యాప్తు చేయనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
రానా కపూర్ కుమార్తెను అడ్డుకున్న పోలీసులు..
రానా కపూర్ కుటుంబం చుట్టు ఎస్ బ్యాంక్ సంక్షోభం ఉచ్చు బిగుస్తోంది. లండన్ వెళ్లేందుకు ముంబయి విమానాశ్రయానికి వచ్చిన ఆయన కుమార్తె రోష్ని కపూర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే.. రానా కుటుంబ సభ్యులందరికీ లుకౌట్ నోటీసులు జారీ చేసింది ఈడీ. రానా భార్య బిందు కపూర్, కుమార్తెలు రాఖీ కపూర్, రాధా కపూర్, రోష్నీ కపూర్లు దేశం విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే బ్రిటీష్ ఎయిర్వేస్లో లండన్ వెళ్లేందుకు వచ్చిన రోష్నీ కపూర్‌ను అడ్డుకున్నారు పోలీసులు.