ప్రముఖ సంస్థ జీవీకే గ్రూప్ ఛైర్మన్ వెంకట కృష్ణారెడ్డి, అతని కుమారుడు సంజయ్ రెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసింది. వీరితోపాటు మరికొంతమందినీ ఈ జాబితాలో చేర్చింది. ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం (ఎంఐఏఎల్)ను నిర్వహిస్తున్న ఈ సంస్థ రూ.705 కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించింది సీబీఐ.
బోగస్ కాంట్రాక్టులు..
ముంబయి విమానాశ్రయ అభివృద్ధి, నిర్వహణ పబ్లిక్- ప్రైవేట్ భాగస్వామ్యంలో జీవీకే ఎయిర్పోర్ట్స్ హోల్డింగ్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. ఈ మేరకు భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) 2006 ఏప్రిల్ 4న ఎంఐఏఎల్తో ఒప్పందం కుదుర్చుకుంది.
జీవికే గ్రూప్ ప్రమోటర్లు, ఎగ్జిక్యూటివ్స్, ఏఏఐలోని కొంతమంది అధికారులకు అనుగుణంగా వివిధ మార్గాలను ఉపయోగించి నిధులను వాడుకున్నారని ఆరోపణలు ఉన్నట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. 2017-18 కాలంలో 9 కంపెనీలకు బోగస్ కాంట్రాక్టులు ఇచ్చారని, దీని వల్ల రూ.310 కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపించారు.