ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు స్వదేశీ వస్తువులనే వినియోగించాలని ఆర్థిక ప్యాకేజీ ప్రకటనలో భాగంగా దేశప్రజలను కోరింది కేంద్రం. ఆ దిశగా చైనా ఉత్పత్తులను బహిష్కరించేందుకు నడుం బిగించింది అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ). జూన్ 10 నుంచి దేశవ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుట్టింది.
తూర్పు లద్దాక్‌లోని సరిహద్దులో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో వ్యాపార సమాఖ్య ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సీఏఐటీలో 7 కోట్లమందికి పైగా వ్యాపారులు, 40 వేల వ్యాపార సంఘాలు ఉన్నాయి. ఈ ప్రచారంలో భాగంగా వ్యాపారులు చైనా ఉత్పత్తులను విక్రయించకుండా అవగాహన కల్పించనుంది సమాఖ్య. అంతేకాదు వినియోగదారులు చైనా ఉత్పత్తుల స్థానంలో దేశీయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని కోరనుంది. దీని ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'వోకల్ ఫర్ లోకల్' పిలుపు కూడా సాకారమవుతుందని ఓ ప్రకటనలో తెలిపింది.