బ్రిటన్‌కు చెందిన కెయిర్న్ ఎనర్జీ పీఎల్సీ (cairn energy) కీలక నిర్ణయం తీసుకుంది. రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదంలో (cairn retrospective tax) రాజీ కోసం భారత్ చేసిన ప్రతిపాదనకు అంగీకరించింది. బిలియన్ డాలర్ల పన్నును తిరిగి తమకు చెల్లించేస్తే.. అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్‌పై వేసిన పన్నులన్నింటినీ కొద్దిరోజుల్లోనే ఉపసంహరించుకుంటామని (india cairn dispute ) కెయిర్న్ సీఈఓ సైమన్ థామ్సన్ స్పష్టం చేశారు. పీటీఐ ముఖాముఖిలో ఈమేరకు వెల్లడించారు.
"ప్రభుత్వంపై కేసులు ఉపసంహరించుకునేందుకు రీఫండ్ ఇచ్చే ఆఫర్ మాకు ఆమోదయోగ్యమే. అమెరికాలోని ఎయిర్ఇండియా విమానాలతో సహా ప్యారిస్ ఆస్తుల జప్తు కోసం దాఖలు చేసిన కేసులను కెయిర్న్ ఉపసంహరించుకుంటుంది. రీఫండ్ వచ్చిన కొద్దిరోజుల్లోనే ఈ ప్రక్రియ చేపడతాం. ఈ ఒప్పందాన్ని ఆమోదించి.. ముందుకెళ్లాలనే షేర్హోల్డర్లు భావిస్తున్నారు."
-సైమన్ థామ్సన్, కెయిర్న్ సీఈఓ
పాత తేదీల నుంచి పన్ను వసూలు చేసే పద్ధతినే రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్ అని పిలుస్తారు.
'ఆ చట్టం భేష్'
రెట్రోస్పెక్టివ్ పన్ను వసూలు విధానాన్ని ఉపసంహరిస్తూ చట్టం (retrospective tax law) తీసుకురావడం భారత ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయమని అన్నారు థామ్సన్. వివాదాన్ని త్వరగా పరిష్కరించుకోవాలని భారత ప్రభుత్వం సైతం భావించినట్లు పేర్కొన్నారు.
"భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మేం సంతోషించాం. అది చాలా సాహసోపేత నిర్ణయం. ఇరువురి(భారత్, కెయిర్న్) ఉద్దేశం వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించుకోవడమే. వచ్చే కొన్ని వారాల్లో ఇది జరుగుతుందని భావిస్తున్నా. మాకు, మా షేర్‌హోల్డర్లకే కాదు.. భారత్‌కు కూడా ఇది చాలా ముఖ్యం. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ను భారత ప్రభుత్వం గౌరవించకపోవడం వల్లే ఈ వ్యాజ్యాలు తీసుకురావాల్సి వచ్చింది. రీఫండ్ ఇస్తే.. అన్ని కేసులను ఉపసంహరించుకుంటాం. ఇక ఇంతటితో ఈ వివాదం ముగుస్తుంది."