ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో శుక్రవారం స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించింది. లిస్టింగ్ తొలి రోజే సంస్థ షేర్లు మదుపరులకు కాసులు కురిపిస్తున్నాయి.
జొమాటో షేరు ఐపీఓలో రూ.76కు ఇష్యూ చేయగా.. బీఎస్ఈలో 51.31 (రూ.115) శాతం ప్రీమియంతో లిస్టయింది. ఓ దశలో కంపెనీ షేరు విలువ రూ.138ని తాకింది. షేరు ఇష్యూ ధరతో పోలిస్తే.. ఇది 81.57 శాతం అధికం.
ఎన్ఎస్ఈలోనూ జొమాటో షేరు 52.63 శాతం ప్రీమియంతో.. రూ.116 వద్ద లిస్టయింది.
బీఎస్ఈలో లభ్యమైన డేటా ప్రకారం.. జొమాటో మార్కెట్ క్యాపిటల్ (ఎం-క్యాప్) ప్రస్తుతం 97,515 కోట్లుగా ఉంది.
ప్రారంభంలోనే బీఎస్‌ఈలో 42 లక్షల షేర్లు, ఎన్‌ఎస్‌ఈలో 19.41 లక్షల షేర్లు చేతులు మారాయి.
2 రోజుల ముందే లిస్టింగ్..
వాస్తవానికి జొమాటో షేర్లు జులై 27న (మంగళవారం) నమోదు కావాల్సి ఉండగా.. 2 పనిదినాల ముందుకు జరపడం గమనార్హం. ఇందుకోసం షేర్ల కేటాయింపు ప్రక్రియను సంస్థ గురువారమే పూర్తి చేసింది. రూపాయి ముఖ విలువ కలిగిన షేరును రూ.75 ప్రీమియంతో రూ.76 చొప్పున కంపెనీ కేటాయించింది. గత శుక్రవారం (16న) ముగిసిన జొమాటో ఐపీఓకు 40.38 రెట్ల స్పందన లభించింది. 2020 మార్చి తర్వాత (ఎస్‌బీఐ కార్డ్స్- రూ.10,341 కోట్లు) అధిక నిధులు సమీకరించిన ఐపీఓ ఇదే. దాఖలైన బిడ్ల విలువ రూ.2.13 లక్షల కోట్లు.
భవిష్యత్‌పై ధీమా..
లిస్టింగ్‌కు కొన్ని నిమిషాల ముందు జొమాటో వ్యవస్థాపకుడు వాటాదార్లకు లేఖ రాశారు. సంస్థ భవిష్యత్తు మనుగడపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. జొమాటోతో పాటు మరో ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ప్రపంచస్థాయి సంస్థలుగా ఎదగనున్నాయని ధీమా వ్యక్తం చేశారు. భారతదేశ వృద్ధిపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. భారత్ వంటి క్లిష్టమైన మార్కెట్లలో నిరూపించుకుంటే తిరుగే ఉండదని అభిప్రాయపడ్డారు. గత పదేళ్ల ప్రయాణంలో అనేక ఒడుదొడుకులు ఎదుర్కొన్నామన్నారు. రానున్న పదేళ్లు.. ఆపై దృష్టి సారించామని తెలిపారు. స్వల్పకాల లాభాలపై దృష్టి పెట్టకుండా దీర్ఘకాల విజయం కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:ఎయిర్టెల్, వొడాఫోన్‌కు భారీ షాక్