మదుపరుల్లో బడ్జెట్‌పై నెలకొన్న అసంతృప్తి కారణంగా స్టాక్ మార్కెట్లు నేడు భారీగా కుంగాయి. బ్యాంకింగ్ రంగంలోని కొన్ని సంస్థలు తప్ప.. మిగతా రంగాలన్నీ దాదాపుగా నష్టాలను నమోదు చేశాయి. బ్యాంకింగ్ రంగానికి మూల ధన సహాయం కింద రూ.70,000 కోట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఫలితంగా బ్యాంకింగ్ షేర్లు మాత్రమే కాస్త రాణించాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 395 పాయింట్లు నష్టపోయింది. చివరకు 39,513 వద్ద స్థిర పడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 135 పాయింట్లు కోల్పోయి 11,811 వద్ద ట్రేడింగ్ ముగించింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ నేటి సెషన్ మొత్తం 39,441-40,032 పాయింట్ల మధ్య కదలాడింది.
నిఫ్టీ నేడు 11,964 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. ఒకానొక దశలో 11,881 పాయింట్ల కనిష్ఠానికి తగ్గింది.
ఇవీ కారణాలు
కేంద్ర బడ్జెట్-2019పై మార్కెట్ వర్గాలు కొండంత ఆశలు పెట్టుకున్నాయి. అయితే ఈ అంచనాలను తలకిందులు చేస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ముఖ్యంగా రూ.1,05,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు మంత్రి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఈ మొత్తాలు రూ.90,000 కోట్లుగా మాత్రమే ఉన్నాయి.
పెట్రోలుపై ఒక రూపాయి ఎక్సైజ్ సుంకం పెంచడం, బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచడం వంటి నిర్ణయాలు మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.