తెలంగాణ

telangana

ETV Bharat / business

వీఆర్​ఎస్​కు 80వేల మంది బీఎస్​ఎన్​ఎల్ ఉద్యోగులు!

ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని 80 వేల మంది ఉద్యోగులు వినియోగించుకునే అవకాశముందని బీఎస్​ఎన్ఎల్​ భావిస్తోంది. ఈ పథకానికి డిసెంబర్​ 3 వరకు దరఖాస్తుల స్వీకరించనున్నట్లు బీఎస్ఎన్​ఎల్​ తెలిపింది.

బీఎస్​ఎన్​ఎల్ వీఆర్​ఎస్

By

Published : Nov 6, 2019, 6:05 PM IST

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థల బీఎస్​ఎన్​ఎల్, ఎంటీఎన్​ఎల్​ సంస్థలను అప్పుల నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం ఇటీవల భారీ ప్యాకేజీని ప్రకటించింది. ఉద్యోగుల కోసం స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్​ఎస్) పథకాన్ని తీసుకువచ్చింది.

ఈ పథకాన్ని మొత్తం 70,000 నుంచి 80,000 మంది ఉద్యోగులు వినియోగించుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్లు బీఎస్​ఎన్​ఎల్ అంచనా వేస్తోంది. ఫలితంగా వేతన బిల్లులో రూ.7,000 కోట్ల మిగులు ఏర్పడుతుందని ఆశిస్తోంది.

డిసెంబర్ 3 వరకు గడువు..

నవంబర్​ 4న ప్రారంభమైన ఈ పథకం వచ్చే నెల 3 వరకు అందుబాటులో ఉంటుందని బీఎస్​ఎన్​ఎల్ ఛైర్మన్, ఎండీ పి.కె.పర్వార్ తెలిపారు. వీఆర్​ఎస్​ పూర్తి వివరాలు ఉద్యోగులకు తెలిపేందుకు క్షేత్ర స్థాయి విభాగాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

వారంతా అర్హులే..

వీఆర్​ఎస్​-2019 పథకానికి శాశ్వత ఉద్యోగులంతా అర్హులని పేర్కొంది యాజమాన్యం. బీఎస్​ఎన్​ఎల్ నుంచి ఇతర సంస్థలకు, ఇతర విభాగాలకు డిప్యుటేషన్​పై వెళ్లిన ఉద్యోగులూ వీఆర్​ఎస్​కు అర్హులేనని స్పష్టం చేసింది.

సంస్థలో పని చేస్తూ 50 ఏళ్లు దాటిన ఉద్యోగులంతా వీఆర్​ఎస్​ పథకాన్ని వినియోగించుకోవచ్చని యాజమాన్యం తెలిపింది. ఈ ప్రాతిపాదికన దేశవ్యాప్తంగా ఉన్న లక్షా 50 వేల మంది బీఎస్​ఎన్​ఎల్​ ఉద్యోగుల్లో.. లక్ష మందికి వీఆర్​ఎస్​కు అర్హత ఉన్నట్లు వెల్లడించింది.

వీఆర్ఎస్​కు అర్హత కలిగిన ఉద్యోగులు.. వారు పని చేసిన ప్రతి ఏడాదికి 35 రోజుల చొప్పున.. మిగిలిన ఉద్యోగ సంవత్సరాలకు 25 రోజుల చొప్పున ఎక్స్​గ్రేషియా పొందుతారు.

బీఎస్ఎన్​ఎల్​తో పాటే ఎంటీఎన్​ఎల్​ తమ ఉద్యోగులకు వీఆర్​ఎస్​ పథకాన్ని ప్రకటించింది. 50 ఏళ్లు దాటిన శాశ్వత ఉద్యోగులు ఇందుకు అర్హులని వెల్లడించింది ఆ సంస్థ ఉద్యోగులకు తెలిపింది.

ఈ రెండు ప్రభుత్వ సంస్థలను విలీనం చేసేందుకు కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం ముద్ర వేసిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశముంది.

ఇదీ చూడండి: రూ.39వేల దిగువకు పసిడి.. నేడు ఎంత తగ్గిందంటే?

ABOUT THE AUTHOR

...view details