తెలంగాణ

telangana

ETV Bharat / business

భారత వృద్ధి భయాలు పెంచుతున్న మూడీస్ నివేదిక - వాణిజ్య వార్తలు

దేశ ఆర్థిక వృద్ధి భయాలను మరింత పెంచుతూ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తాజా నివేదిక విడుదల చేసింది. అనుకున్నదాని కన్నా వృద్ధి మరింత క్షీణించే అవకాశముందనే అంచనాల కారణంగా.. భారత క్రెడిట్​ రేటింగ్​ను తగ్గిస్తున్నట్లు పేర్కొంది. వృద్ధికి ఊతమందించే దిశగా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను మూడీస్ గుర్తు చేసింది.

మూడీస్

By

Published : Nov 8, 2019, 12:47 PM IST

భారత్​ క్రెడిట్​ రేటింగ్​ దృక్పథాన్ని తగ్గిస్తూ.. ప్రముఖ రేటింగ్​ ఇన్వెస్టర్స్ సర్వీస్ మూడీస్ నివేదిక విడుదల చేసింది. ఇప్పటి వరకు స్థిరంగా ఉన్న ఆర్థిక వ్యవస్థని ప్రస్తుతం ప్రతికూల జాబితాలో చేర్చింది. గతంతో పోలిస్తే ఆర్థిక వృద్ధి మరింత క్షీణించే ప్రమాదం ఉందని మూడీస్ అంచనా వేసింది. ఆర్థిక, సంస్థాగత బలహీనతల్ని పరిష్కరించడంలో మూడీస్‌ అంచనాల కన్నా ప్రభుత్వం నెమ్మదిగా స్పందిస్తోందని అభిప్రాయపడింది. ఇదిలాగే కొనసాగితే ఇప్పటికే తీవ్ర స్థాయికి చేరుకున్న అప్పుల భారం మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రభుత్వం తీసుకునే చర్యలు వృద్ధి రేటు మందగమన సమస్యను పరిష్కరించేలా ఉండాలని స్పష్టం చేసింది. అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ఒడుదొడుకులను, మందగించిన ఉద్యోగ కల్పన, బ్యాంకింగేతర రంగాల సంక్షోభాన్ని అధిగమించేలా ప్రభుత్వ చర్యలు ఉండాల్సిన అవసరం ఉందని సూచించింది. వాణిజ్య పెట్టుబడులు, వృద్ధిని మరింత వేగంగా పరుగులు పెట్టించే సంస్కరణల అవకాశాలు తగ్గిపోయాయని మూడీస్‌ అభిప్రాయపడింది.

స్పందించిన ఆర్థికశాఖ ..

మూడీస్‌ రేటింగ్‌పై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. దేశ ఆర్థిక పునాదులు బలంగానే ఉన్నాయని స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణం అదుపులో ఉందని తెలిపింది.
స్వల్ప, మధ్యకాలిక వృద్ధికి భారత్‌లో మెరుగైన అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

అంతర్జాతీయంగా నెలకొన్న మందగమనాన్ని దృష్టిలో పెట్టుకుని భారత్‌ అనేక చర్యలు చేపట్టిందని తెలిపింది. భారత్‌కు పెట్టుబడులు వచ్చే అవకాశాలు పెరిగాయని.. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌ స్థితి మెరుగ్గానే ఉందని ఆర్థికశాఖ వెల్లడించింది.. భారత వృద్ధి రేటు 2019లో 6.1శాతానికి, 2020లో 7 శాతానికి పెరిగే అవకాశం ఉందన్న ఇటీవలి ఐఎంఎఫ్‌ నివేదికను ఆర్థిక శాఖ ఈ సందర్భంగా ఉటంకించింది.

ఇదీ చూడండి: ఆన్​లైన్​లో హాస్టల్​ బుకింగ్​... అందులోనూ డిస్కౌంట్​...

ABOUT THE AUTHOR

...view details