హైదరాబాద్‌కు చెందిన టీకాల తయారీ సంస్థ బయోలాజికల్ ఈ.లిమిటెడ్ (బీఈ) అభివృద్ధి చేస్తున్న 'కరోనా' టీకాపై వచ్చే ఏడాది జనవరి తర్వాత మూడో దశ క్లినికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అమెరికాకు చెందిన బేలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్, డైనావాక్స్ టెక్నాలజీస్‌తో కలిసి కరోనా టీకాను బయోలాజికల్ ఇ.లిమిటెడ్ అభివృద్ధి చేస్తున్న సంగతి విదితమే. దీనిపై మొదటి- రెండో దశ క్లినికల్ పరీక్షలు ఇటీవల ప్రారంభం అయ్యాయి. ఈ ఫలితాలు జనవరి నెలాఖరు నాటికి వెల్లడవుతాయి. తదనంతరం నేరుగా మూడో దశ క్లినికల్ పరీక్షలు ప్రారంభించే అవకాశం ఉందని బయోలాజికల్ ఈ.లిమిటెడ్ ఎండీ మహిమా దాట్ల తెలిపారు. సోమవారం యార్లగడ్డ శ్రీరాములు 17వ స్మారక ఉపన్యాసంలో 'కొవిడ్-19 వ్యాక్సిన్- అభివృద్ధి, సవాళ్లు' అంశంపై ఆమె మాట్లాడారు.
30వేల మందిపై మూడో దశ పరీక్షలు..
మూడో దశ క్లినికల్ పరీక్షలను దాదాపు 30,000 మంది వలంటీర్లపై నిర్వహిస్తామని తెలిపారు మహిమా దాట్ల. వచ్చే ఏడాది జూన్- జులై నాటికి ఈ పరీక్షల పలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు. ఇదేకాకుండా జాన్సన్ అండ్ జాన్సన్‌తోనూ తమకు టీకా తయారీ ఒప్పందం ఉందని, ఆ కంపెనీ అభివృద్ధి చేసిన కరోనా టీకాపై ఇప్పుడు మూడో దశ క్లినికల్ పరీక్షలు జరుగుతున్నాయని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా 45 టీకాలు క్లినికల్ పరీక్షల దశకు చేరాయి. ఆక్స్‌ఫర్డ్- ఆస్ట్ర జెనేకా టీకా 70 శాతానికి పైగా సమర్థతను నమోదు చేసిందని ఉదహరించారు. ‘ఈ పరిణామాలను చూస్తుంటే, కరోనా టీకా తీసుకురాగలం అనే నమ్మకం కలుగుతోంది. పది రోజుల క్రితం వరకు ఇటువంటి పరిస్థితి లేదు’ అన్నారామె.