దాదాపు మూడు దశాబ్దాల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ విడాకుల కోసం(Gates Divorce) బిల్‌గేట్స్ - మెలిందా దంపతులు కోర్టు మెట్లు ఎక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మైక్రోసాఫ్ట్ అధినేతలుగానే కాకుండా పలు ధార్మిక కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొన్న ఈ జంట విడిపోవడం(Gates Divorce) యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అయితే వీరివురితో పాటు మరో కుబేరుడు వారెట్ బఫెట్ ఆధ్వర్యంలో నడిచే బిల్-మెలిందా గేట్స్ ఫౌండేషన్ మనుగడపై సర్వత్రా సందేహం వ్యక్తమైంది. కానీ, ఫౌండేషన్‌ను ఇరువురం కలిసే కొనసాగిస్తామని ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద దాతృత్వ సంస్థగా పేరుగాంచి అంతర్జాతీయంగా విశేష సేవలందిస్తున్న ఫౌండేషన్ మనుగడపై సందేహాలు తొలగిపోయాయి. అయితే, తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన ఓ కథనం ఇప్పుడు ఫౌండేషన్ నిర్వహణకు సంబంధించిన ఓ కొత్త ట్విస్టును తెరపైకి తీసుకొచ్చింది.
డైరెక్టర్లుగా బయటి వ్యక్తులు..
ఫౌండేషన్ నిర్మాణంలో కొన్ని మార్పులు తేవాలని బిల్, మెలిందా భావిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇరువురు విడిపోతున్న నేపథ్యంలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలిగే ఓ పాలక వ్యవస్థను ఫౌండేషన్‌లో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా ఓ బోర్డును ఏర్పాటు చేసి బయటి వ్యక్తులను డైరెక్టర్లుగా నియమించాలని ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. విడాకుల నేపథ్యంలో సంస్థ సుస్థిరతను కాపాడడం కోసమే మెలిందా గేట్స్ ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారని తెలిపారు.
తుది నిర్ణయం తీసుకోలేదు..
సంస్థ సుదీర్ఘకాలం సుస్థిర మనుగడ కొనసాగించేలా బిల్, మెలిందాతో చర్చిస్తున్నట్లు ఫౌండేషన్ సీఈఓ మార్క్ సుజ్‌మన్ ఇటీవల ఉద్యోగులకు తెలపగా.. ఈ వార్తలకు బలం చేకూరింది. ఫౌండేషన్ నిర్వహణకు సంబంధించి వారు ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. అయితే సంస్థ కోసం కలిసి పనిచేస్తామని మాత్రం హామీ ఇచ్చారన్నారు.