భారత్ సహా మొత్తం 13 దేశాల్లో రిటైల్ వ్యాపారం నుంచి నిష్క్రమించేందుకు అమెరికాకు చెందిన బ్యాంకింగ్ దిగ్గజం సిటీ బ్యాంక్ సిద్ధమైంది. ఈ వ్యాపారాన్ని విక్రయించేందుకు సరైన కొనుగోలుదారు కోసం అన్వేషిస్తోంది. రిటైల్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డులు, గృహ రుణాలు, వెల్త్ మేనేజ్‌మెంట్ సేవలు నిర్వహించే ఈ సంస్థ నిష్క్రమణ భారత్‌లోని చిన్న బ్యాంకులకు ఓ అవకాశమనే చెప్పాలి.
నిష్క్రమణ ఎందుకంటే..
టోరంటో కేంద్రంగా పనిచేసే ఈ దిగ్గజ బ్యాంకు వార్షిక లాభాల్లో భారత్‌లోని రిటైల్ వ్యాపారం ద్వారా వస్తున్నది చాలా చాలా తక్కువ. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో సంస్థ ఆర్జించిన లాభాల్లో రిటైల్ విభాగం వాటా కేవలం 20 శాతం మాత్రమే. ఇక అంతర్జాతీయంగా సంస్థ ఆస్తుల్లో భారత రిటైల్ విభాగం వాటా 1.5 శాతమే. ఈ నేపథ్యంలో వినియోగదారుల వ్యాపారం నుంచి బయటకొచ్చి.. పూర్తిగా కార్పొరేట్ వ్యాపారంపై దృష్టి పెట్టాలని సిటీ గ్రూప్ భావిస్తోంది. ఈ విభాగంలో విస్తరించేందుకు పెట్టుబడులు పెట్టాలనుకుంటోంది.
బలమైన క్రెడిట్ కార్డు బిజినెస్..
సిటీ గ్రూప్ నిష్క్రమణ దేశీయ సంస్థలకు ఓ ఆకర్షణీయ అవకాశమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విస్తరణ దిశగా అడుగులు వేస్తున్న చిన్న బ్యాంకులకు సిటీ బ్యాంక్ పోర్ట్‌ఫోలియో మెరుగైన కస్టమర్ బేస్‌ను తీసుకొచ్చి పెడుతుందని తెలిపారు. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ బిజినెస్‌లో సిటీ బ్యాంక్‌ది ప్రత్యేక స్థానం. ఈ సంస్థకు చెందిన కార్డుల్లో చాలా వరకు ప్రీమియం, కార్పొరేట్ సాలరీ అకౌంట్ కార్డులే కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి బడా బ్యాంకులూ సిటీ బ్యాంకు కొనుగోలుకు ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. వాస్తవానికి సిటీ బ్యాంక్ మార్కెట్ షేర్‌ని హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ కార్డ్ వంటి సంస్థలు చేజిక్కించుకున్నాయి. దశాబ్దం క్రితం 20 శాతంగా ఉన్న సిటీ బ్యాంక్ మార్కెట్ షేరు ఇప్పుడు నాలుగు శాతానికి పడిపోయింది. అయితే, ఈ బ్యాంకు కార్డ్ పోర్టుఫోలియో మాత్రం పటిష్ఠంగా ఉంది. ఒక్కో కార్డుపై ఏటా ఖర్చు చేసే మొత్తంలో 15-20 శాతం వృద్ధి నమోదు చేయడం గమనార్హం. ఇది ఈ బ్యాంకు ఖాతాదారుల ఖర్చు చేసే శక్తిని తెలియజేస్తోంది.