కొవిడ్ నిరోధానికి తాము అభివృద్ధి చేస్తోన్న 'కొవాగ్జిన్' సమర్థత 60 శాతానికి పైగానే ఉంటుందని హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే భారత్ బయోటెక్ వెల్లడించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)తో కలిసి భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది.
ఈ వ్యాక్సిన్ మూడోదశ క్లినికల్ పరీక్షలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఇందులో 26,000 మంది వలంటీర్లు భాగస్వాములవుతున్నారు. "కనీసం 60 శాతం సమర్థత సాధించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇంతకన్నా అధిక సమర్థతనే కొవాగ్జిన్ కలిగి ఉండొచ్చు" అని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి.సాయిప్రసాద్ పేర్కొన్నట్లు సీఎన్‌ఎన్-న్యూస్ 18 వెల్లడించింది.