తెలంగాణ

telangana

ETV Bharat / business

అత్యంత యువ సంపన్నుల్లో బెంగళూరోళ్లు భళా! - యువ బిలియనీర్లు

అత్యంత యువ సంపన్నులకు బెంగళూరు కేంద్రంగా మారింది. ముఖ్యంగా స్వయం కృషితో సాంకేతిక ఆధారంగా పని చేసే అంకుర సంస్థలను స్థాపించి.. బిలియనీర్లుగా మారిన యువత ఇక్కడే ఎక్కువగా ఉండటం విశేషం. బెంగళూరులోని యువ పారిశ్రామిక వేత్తలు స్థాపించిన సంస్థలు, వారి ఆస్తుల వివరాలు మీ కోసం.

STARTUP CAPITAL
అత్యంత యువ సంపన్నుల్లో బెంగళూరోళ్లు భళా!

By

Published : Dec 22, 2019, 7:00 AM IST

భారత ఐటీ నగరంగా పేరొందిన బెంగళూరు ఇప్పుడు సంస్థల నిలయంగా మారింది. ఇటీవల ప్రకటించిన.. హరూన్​ ఇండియా అత్యధిక సంపన్నుల జాబితా 2019లో 40 ఏళ్లలోపు బిలియనీర్లలో తొలి 17 మందిలో 10 మంది బెంగళూరుకు చెందిన వారే కావడం విశేషం.

బెంగళూరులో జెరోధా స్థాపకుడు నితీశ్​ కామత్, ఫ్లిప్​కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్​ బన్సాల్​లు మిలీనియల్ బిలియనీర్లుగా జాబితాలో తొలి స్థానాల్లో ఉన్నారు.

బెంగళూరు సంపన్న అంకురాల వ్యవస్థాపకులు..

నితిన్​ కామత్​

బెంగళూరులో అత్యంత పిన్న వయస్సు బిలియనీర్​గా నితిన్​ కామత్​ ఉన్నారు. ప్రముఖ డిస్కౌంట్​ బ్రోకరేజీ సంస్థ జెరోధా వ్యవస్థాపకుల్లో ఈయన ఒకరు. ప్రస్తుతం నితిన్​ కామత్​ వయస్సు 39 ఏళ్లు. సంపద దాదాపు రూ.6,600 కోట్లు.

2010లో స్థాపించిన జెరోధా బ్రోకరేజి ఇప్పుడు.. 15 శాతం వాటాతో భారత రిటైల్ ట్రేడింగ్​లో అగ్రగామిగా నిలిచింది. జెరోధాకు దాదాపు 15 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు.

నితిన్​ కాలేజీ రోజుల నుంచే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడం ప్రారంభించాడు. కొన్నాళ్లు టెలిమార్కెటింగ్ ఎగ్జిక్యుటివ్​గా పనిచేసిన నితిన్... 'జెరోధా' నెలకొల్పిన తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.

సచిన్​ బన్సాల్​

ఈ జాబితాలో రూ.6,100 కోట్లతో సచిన్​ బన్సాల్​, రూ.5,500 కోట్లతో బిన్నీ బన్సాల్​ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్​లో ఉన్నత స్థాయి ఉద్యోగాలు వీడి దేశీయ ఈ కామర్స్​ సంస్థ ఫ్లిప్​కార్ట్​ను ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ దేశీయ దిగ్గజంగా ఫ్లిప్​కార్ట్​ అవతరించింది. ఫ్లిప్​కార్ట్​లో 77 శాతం వాటాను గత ఏడాది అమెరికాకు చెందిన వాల్​మార్ట్​ కొనుగోలు చేసింది.

ఇందులో సచిన్​ బన్సాల్​కు చెందిన 5.5-6 శాతం వాటాను బిలియన్​ డాలర్లకు విక్రయించారు. అప్పటికి ఫ్లిప్​కార్ట్​లో బిన్నీ బన్సాల్​ వాటా 700-800 మిలియన్​ డాలర్లుగా ఉన్నట్లు అంచనా.

నిఖిల్​​ కామత్​

నితిన్​ కామత్​ సోదరుడు నిఖిల్​ కామత్​ బెంగళూరులో అత్యంత యువ సంపన్నుల్లో నాలుగో స్థానంలో ఉన్నారు. ఈయన సంపద 4,400 కోట్లుగా అంచనా. నిఖిల్​ ట్రూబెకాన్​, జెరోధాల వ్యవస్థాపకుల్లో ఒకరు.

రిజూ రవీంద్రన్​

ఆన్​లైన్​ లెర్నింగ్​ యాప్​ 'బైజూస్' సహ వ్యవస్థాపకుడే రిజూ రవీంద్రన్​. ప్రస్తుతం ఈయన సంపద రూ.3,600 కోట్లుగా అంచనా. బెంగళూరు కేంద్రంగా పని చేస్తోన్న 'థింక్​ & లెర్నింగ్​ ప్రైవేట్​ లిమిటెడ్'​కు చెందిన ఈ అంకుర సంస్థ విలువ జులైలో 5.5 బిలియన్​ డాలర్లుగా ఉంది.

బైజూస్​ సహ వ్యవస్థాపకురాలు, బైజూ రవీంద్రనర్​ భార్య దివ్యా గోకుల్​నాథ్​ కూడా అత్యంత యువ ధనవంతుల్లో ఒకరు. ఈమె సంపద దాదాపు రూ.1,800 కోట్లుగా అంచనా.

ఫ్లిప్​కార్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్​లు

ఫ్లిప్​కార్ట్​ మాజీ ఎగ్జిక్యూటివ్​లు అమోద్​ మాల్వియా, సుజీత్​ కుమార్, వైభవ్​ గుప్తాలు.. 40 ఏళ్ల లోపు బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించారు. వీరి సంపద ఒక్కొక్కరికి రూ.3,500 కోట్లుగా అంచనా.

భవిశ్​ అగర్వాల్

ప్రముఖ ఆన్​లైన్​ క్యాబ్​ సేవల సంస్థ వ్యవస్థాపకుడు భవిశ్​ అగర్వాల్ ఈ జాబితాలో ఉన్నారు. ఈయన సంపద రూ.3,100 కోట్లుగా అంచనా. మూడేళ్ల పాటు మైక్రోసాఫ్ట్​లో ఉద్యోగం చేసిన తర్వాత ఈయన.. 2010లో తన సొంత కంపెనీ 'ఏఎన్​ఐ టెక్నాలజీస్'​ను స్థాపించారు. ఈ సంస్థ వేగంగా అభివృద్ధి చెందిన అంకురాలలో ఒకటిగా నిలిచింది. ఓలా సహ వ్యవస్థాపకుడు, ఛీఫ్​ టెక్నాలజీ అధికారి అంకిత్​ భేతి కూడా అత్యంత సంపన్నుల జాబితాలో ఉన్నారు. ఈయన సంపద రూ.1,400 కోట్లుగా అంచనా.

స్వయం కృషితో.. కోటీశ్వరులుగా ఎదిగిన వారిలో ఎక్కువ మంది సాంకేతికతతో కూడుకున్న సంస్థలనే నమ్ముకోవడం విశేషం. 40 ఏళ్లలోపు యువ పారిశ్రామికవేత్తల సగటు వయస్సు 35. వీరి సంపద మొత్తం రూ.40,000 కోట్లు. ఒక్కొక్కరి సగటు సంపద రూ.4,200 కోట్లు.

40 ఏళ్లలోపు పారిశ్రామికవేత్తల్లో.. అత్యంత పిన్న వయస్కుడు ఓయో రూమ్స్​ వ్యవస్థాపకుడు రితేశ్​ అగర్వాల్ (దిల్లీ)​. ఈయన సంపద రూ. 7,500 కోట్లు. అత్యం సంపన్న యువ పారిశ్రామిక వేత్త దివ్యాంక్​ తురాకియా(దుబాయ్​). ఈయన 2010లో 'మీడియా డాట్‌నెట్‌'ను స్థాపించారు. ప్రపంచంలోని ఐదు అతిపెద్ద ఆన్‌లైన్‌ వ్యాపార ప్రకటనల సంస్థల్లో మీడియా డాట్‌నెట్‌ ఒకటి.

2016లో మీడియా డాట్‌ నెట్‌ను దివ్యాంక్‌ విక్రయించారు. ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌ వ్యాపార ప్రకటనల విభాగంలో చోటుచేసుకున్న మూడో అతిపెద్ద విక్రయ లావాదేవీగా ఇది నిలిచింది. దివ్యాంక్ సంపద దాదాపు రూ.13,000 కోట్లుగా అంచనా.

ఇదీ చూడండి:దేశంలో అధిక వేతనాలు ఉన్న నగరాల్లో ఇదే టాప్!​

ABOUT THE AUTHOR

...view details