ఆంధ్రప్రదేశ్ అనంతపురంలో తయారైన సెల్టోస్ కారును బెంగళూరులో ఆవిష్కరించారు కియా మోటార్స్ ఇండియా. ఈ సందర్భంగా ఈటీవీ భారత్తో ప్రత్యేకంగా మాట్లాడారు కియా మోటార్స్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ అధిపతి మనోహర్ భట్. అనంతరపురంలో కర్మాగారం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంపై స్పందించారు.
"భారత్లో 1.1 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాం. ఏటా 3 లక్షల కార్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాం. భారత్లో కియా వాటా 1000లో 30 వరకు ఉండే అవకాశం ఉంది. అదే చైనాలో 1000లో 100 కార్లు కియావే.
భారత్లో ఆర్థిక వృద్ధి వేగంగా జరుగుతోంది. వాహన రంగంలో మందగమనం శాశ్వతం కాదు.
కర్మాగారం ప్రారంభించడానికి రవాణా, మానవ వనరులు, మౌలిక సదుపాయాలు తదితర అంశాలన్ని పరిగణనలోకి తీసుకున్నాం. అందుకే అనంతపురాన్ని ఎంపిక చేశాం. మాకు ఏ ప్రభుత్వంతోనూ ఇబ్బంది కలగలేదు. గత, ప్రస్తుత ప్రభుత్వాల నుంచి పూర్తిగా సహకారం లభించింది. అధికారులు వేగంగా స్పందించారు.