బ్యాంకింగ్ సంఘాల సమ్మెతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు పాక్షికంగా నిలిచిపోయాయి. పది ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. రెండు ఉద్యోగ సంఘాలు నిరసనలు చేపట్టాయి. ముందుగా ప్రకటించినట్లుగానే అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం, భారతీయ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య సమ్మెకు ప్రాతినిథ్యం వహిస్తున్నాయి.
పెద్ద ఎత్తున బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడం కారణంగా చాలా ప్రాంతాల్లో నగదు విత్డ్రా, డిపాజిట్ సహా పలు కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ బ్యాంకు శాఖలు మాత్రం యథావిథిగా పని చేస్తున్నాయి.