తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్బీఐతో పాటే బ్యాంకుల వడ్డీ సవరణ..! - ఎంసీఎస్​ఆర్​

దేశంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల అధిపతులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం భేటీ అయ్యారు. అర్బీఐ రెపో రేటు సవరణకు తగ్గట్లు బ్యాంకుల వడ్డీ సవరణ ఉండాలనే అంశంపై చర్చించారు. ఆర్బీఐతో పాటే బ్యాంకుల వడ్డీ సవరణకు బ్యాంకులు అంగీకరించినట్లు సీతారామన్ తెలిపారు.

ఆర్బీఐతో పాటే బ్యాంకుల వడ్డీ సవరణ..!

By

Published : Aug 6, 2019, 7:36 AM IST

దేశ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతి రెండు నెలలకు ఓ సారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్​ ఇండియా (ఆర్బీఐ) రెపో రేట్లను సమీక్షిస్తుంది. ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షలో వడ్డీలను తగ్గించినప్పుడు.. వాటికి అనుగుణంగా బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించాలి. అయితే ఆర్బీఐ తగ్గించిన స్థాయిలో బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించడం లేదనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. ఈ విషయంపై పలు మార్లు ఆర్థిక శాఖ, ఆర్బీఐ.. బ్యాంకులకు హెచ్చరికలు జారీ చేశాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో పాటు హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ, యాక్సిస్​, కోటక్, సిటీ బ్యాంకు సారథులతో భేటీ అయ్యారు. ఆర్బీఐ రేట్ల కోత ప్రకారం బ్యాంకుల వడ్డీ రేట్ల సవరణ ఉండాలనే అంశంపై చర్చించారు. బ్యాంకులన్నీ ఇందుకు అంగీకరించినట్లు సమావేశం తర్వాత నిర్మలా సీతారామన్ తెలిపారు.

గత ఏడాది డిసెంబర్​ నుంచి 25 బేసిస్ పాయింట్ల చొప్పున వడ్డీ తగ్గిస్తూ వస్తోంది ఆర్బీఐ. ఈ ఏడాది ఇప్పటికే మూడు సార్లు రెపో కోత విధించింది. ఆగస్టు 7తో ముగియనున్న తాజా ద్రవ్యపరపతి విధాన సమీక్షలో మరో సారి 25 బేసిస్​ పాయింట్ల రెపో రేటు తగ్గించొచ్చనే అంచనాలున్నాయి.

ఎఫ్‌పీఐలతో చర్చిస్తాం: ఆర్థిక మంత్రి

సార్వత్రిక బడ్జెట్​లో సంపన్న వర్గాలపై సర్​చార్జీ విధిస్తూ తీసుకున్న నిర్ణయంపై నిర్మలా సీతారామన్ స్పందించారు. ఈ కారణంగా విదేశీ పెట్టుబడులు తగ్గిపోతున్నందున వారితో చర్చలకు సిద్ధమైనట్లు ఆమె పేర్కొన్నారు.

విదేశీ పోర్ట్​ఫోలియో మదుపరుల ప్రతినిధులతో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతాను చక్రవర్తి త్వరలోనే చర్చలు జరపనున్నట్లు వెల్లడించారు. వారికి ఏం కావాలో తెలుసుకోనున్నట్లు తెలిపారు.

వివిధ రంగాల ప్రతినిధులతో ఈ వారంలో భేటీ అయి, సమస్యలు తెలుసుకుని, వారికి ఎలాంటి సాయం అందిస్తే ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందో, ఆ చర్యలు తీసుకుంటామని మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.

బ్యాంక్​ ఆఫ్​ బరోడా ఎంసీఎల్​ఆర్​ కోత

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) రుణ రేట్లను సవరించింది. మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ఆధారిత రుణ రేట్లను (ఎంసీఎల్‌ఆర్‌) 15 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించింది. సవరించిన రుణ రేట్లు ఈ నెల 8 (గురువారం) నుంచి అమల్లోకి వస్తాయని ఎక్స్ఛేంజీలకు బ్యాంకు సమాచారమిచ్చింది. వివిధ కాలావధులపై కొత్త రుణ రేట్లు 8.05-8.45 శాతం మధ్య ఉండబోతున్నాయి.

ఇదీ చూడండి: 'పాడిరంగంతో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం'

ABOUT THE AUTHOR

...view details