తెలంగాణ

telangana

ETV Bharat / business

కష్టకాలం:20 ఏళ్ల కనిష్ఠానికి వాహన విక్రయాలు

వాహన తయారీ దారులకు గడ్డుకాలం నడుస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది వాహన విక్రయాలు భారీగా క్షీణించడమే ఇందుకు కారణం. ఒకటి రెండు సంస్థలు మినహా.. చాలా వరకు కంపెనీల వాహన విక్రయాలు రికార్డు స్థాయిలో క్షిణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

CARS
కార్ల విక్రయాలు

By

Published : Jan 3, 2020, 7:47 AM IST

భారత వాహన పరిశ్రమకు గతేడాది (2019) గడ్డుకాలమేనని చెప్పాలి. ఎందుకంటే కార్లు, ఎస్‌యూవీల అమ్మకాలు రెండు దశాబ్దాల కనిష్ఠానికి చేరాయి. అనిశ్చితి పరిస్థితులు కొనసాగడం, రుణాల లభ్యత సంక్లిష్టంగా మారడం, ఆర్థిక మందగమనం తోడవడం వల్ల భారీ రాయితీలు ఇచ్చినా కొనుగోలుదార్లను కంపెనీలు ఆకర్షించలేకపోయాయి. అయితే కియా మోటార్స్‌, ఎమ్‌జీ మోటార్స్‌ వంటి కొత్త బ్రాండ్లు ఇంతటి సంక్లిష్ట మార్కెట్లోనూ మెరుగైన ఆరంభాన్ని అందుకున్నాయి.

వార్షిక అమ్మకాలు 30 లక్షల దిగువకు

2019లో ప్రయాణికుల వాహనాల (కార్లు, వ్యాన్లు, ఎస్‌యూవీలు) అమ్మకాలు 30 లక్షల దిగువకు చేరాయి. 2017లో తొలిసారిగా ఈ స్థాయికి చేరిన సంగతి విదితమే. మారుతీ, హ్యుందాయ్‌, మహీంద్రా, టాటా మోటార్స్‌, హోండా, టొయోటాలు ఎక్కువ క్షీణతను నమోదు చేశాయి. 2018 మధ్య నుంచీ అమ్మకాలు తగ్గడం మొదలై, నెలలు గడిచే కొద్దీ ఆ క్షీణత పెరుగుతూ పోయింది.

ఈ ఏడాదిపై ఆశలు

కొత్త ఏడాదిపై ఆశలు పెట్టుకున్నామని మారుతీ సుజుకీ డైరెక్టర్‌ (మార్కెటింగ్‌, విక్రయాలు) శశాంక్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు. వడ్డీ రేట్లు తగ్గడం సహా.. గ్రామీణ సెంటిమెంటు మెరుగుపడి విక్రయాలు పుంజుకుంటాయని అంచనా వేశారు. గడ్డుకాలం కొనసాగొచ్చని హోండా కార్స్‌ డైరెక్టర్‌ (విక్రయాలు, మార్కెటింగ్‌) రాజేశ్‌ గోయెల్‌ పేర్కొన్నారు. మార్కెట్‌ ఇంత కంటే అధ్వాన స్థితికి వెళ్లదు. కానీ పూర్తిగా పుంజుకోవడానికి కొన్ని త్రైమాసికాలు పట్టవచ్చు. వచ్చే పండుగల సీజనుపై మాకు నమ్మకం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ద్విచక్ర వాహన విక్రయాలు తగ్గాయ్‌

ద్విచక్ర వాహన విక్రయాలు తగ్గాయ్‌

ద్విచక్ర వాహన విక్రయాలు 2019 డిసెంబరులో డీలా పడ్డాయి. అగ్ర కంపెనీలైన హీరో మోటోకార్ప్‌, బజాజ్‌ ఆటో, టీవీఎస్‌ మోటార్‌ల అమ్మకాలు క్షీణించాయి. సుజుకీ మోటార్‌ సైకిల్‌ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌ఎంఐపీఎల్‌) విక్రయాలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. హీరో మోటోకార్ప్‌ దేశీయ విక్రయాలు 2018 డిసెంబరుతో పోలిస్తే 2019 డిసెంబరులో 5.6 శాతం తగ్గి, 4,12,009 వాహనాలకు పరిమితమయ్యాయి. బజాజ్‌ ఆటో మోటార్‌ సైకిల్‌ విక్రయాలు 1,57,252 నుంచి 21 శాతం క్షీణించి 1,24,125 వాహనాలకు పరిమితమయ్యాయి. టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ దేశీయ ద్విచక్ర వాహన విక్రయాలు ఏకంగా 25 శాతం క్షీణించి 1,57,244 వాహనాలుగా నమోదయ్యాయి. వాణిజ్య వాహనాలకొస్తే అశోక్‌ లేలాండ్‌ వాహన విక్రయాలు 2018 డిసెంబరుతో పోలిస్తే 2019 డిసెంబరు నెలలో 28 శాతం క్షీణించాయి.

వివిధ వాహన కంపెనీల డిసెంబరు-2019 విక్రయ గణాంకాలు

ఇదీ చూడండి:వ్యాపార మాయాజాలంలో పడ్డారో.. మీ జేబు గుల్లే!

ABOUT THE AUTHOR

...view details