ఆటోమొబైల్ రంగ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పరిశ్రమ వర్గాలు సొంతంగానే పరిష్కారం కనుగొనాలని భారత వాహన తయారీదారుల సంఘం (సియామ్) పిలుపునిచ్చింది. వాహనాలపై జీఎస్టీ తగ్గింపు ఉండదని తాజాగా స్పష్టమైన నేపథ్యంలో.. ఆటో మొబైల్ సంస్థలు స్వయంగా డిమాండ్ పెంచుకునే ప్రణాళికలు రచించాలని సియామ్ సూచించింది.
గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతగా వాహన రంగం సంక్షోభంలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో అమ్మకాలను ప్రోత్సహించేందుకు జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని వాహన తయారీ సంస్థలు ప్రభుత్వానికి విన్నవించాయి.
"ఇటీవల జరిగిన 37వ జీఎస్టీ మండలి సమావేశంలో వాహనాలపై పన్ను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గుతుందని ఆటో మొబైల్ రంగం భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సమావేశం తర్వాత వాహనాలపై ఎలాంటి పన్ను తగ్గింపు ఉండదని స్పష్టమైంది." - రాజన్ వాద్రా, సియామ్ అధ్యక్షుడు