భారత్‌లో ఈనెల 5న ప్రారంభమైన 'ఆటోఎక్స్‌పో 2020' నేటితో ముగిసినట్లు ఎక్స్పో నిర్వాహకులు తెలిపారు.
ఆటో ఎక్స్పో 2020 విశేషాలు..
గ్రేటర్ నొయిడాలో జరిగిన ఆటో ఎక్స్పో 2020లో మొత్తం 70 వరకు నూతన ఉత్పత్తులను ఆవిష్కరించాయి పలు కంపెనీలు. ఆటో ఎక్స్పోను మొత్తం 6.80 లక్షల మంది సందర్శించారు.
ఈసారి ఆటో ఎక్స్‌పోలో 108 కంపెనీల నుంచి 352 ఉత్పత్తులు ప్రదర్శనకు వచ్చాయని భారత వాహన తయారీ సంఘం (సియామ్) వెల్లడించింది.
పర్యావరణ అనుకూలమైన వాహనాలకు ఈ ఆటో ఎక్స్‌పోలో ప్రాధాన్యత కనిపించింది. ఆటోఎక్స్‌పో 2020లో 35 వరకు విద్యుత్ వాహనాలను అవిష్కరించగా.. 15 కొత్త కాన్సెప్ట్ వాహనాలు ప్రదర్శనకు వచ్చాయి.
ఎక్స్పో నుంచి దిగ్గజాలు దూరం
ఈ ఏడాది ఆటో ఎక్స్పో నుంచి దిగ్గజ వాహన తయారీ సంస్థలైన టొయోటా, బీఎండబ్ల్యూ, ఆడీ సహా ద్విచక్ర వాహన సంస్థలు హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్ దూరంగా ఉన్నాయి.
ఎక్స్‌పోపై కరోనా పడగ..
కరోనా వైరస్ చైనాను వణిస్తున్నందున ఎక్స్పో నుంచి ఆ దేశ ప్రతినిధులు దూరంగా ఉన్నారు.
ఆకట్టుకున్న ఉత్పత్తులు..
ఆటోఎక్స్‌పో 2020లో దిగ్గజ సంస్థలైన మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా&మహీంద్రా, రెనో, మెర్సిడెజ్ బెంజ్, ఫోక్స్‌వ్యాగన్, స్కొడా సహా కొత్తగా కియా, హెక్టార్ వంటి సంస్థలు తమ విద్యుత్ వాహనాలను, ఎస్యూవీ మోడళ్లను ప్రదర్శనకు ఉంచాయి.
ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏసీఎంఏ), కన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియా (సీఐఐ)ల భాగస్వామ్యంతో సియామ్.. ఆటో ఎక్స్పో 2020ని నిర్వహించింది.
ఇదీ చూడండి:ఐటీ రంగంలో ఈ ఏడాది 2 లక్షల కొత్త ఉద్యోగాలు