దేశీయ వాహన సంస్థలు నెమ్మదిగా గాడిలో పడుతున్నాయి. ఆగస్టులో మారుతీ సుజుకీ, హ్యుందాయ్ దేశీయ విక్రయాలు వరుసగా 20.2 శాతం, 19.9 శాతం చొప్పున పెరగడం విశేషం. ఇక మహీంద్రా, టయోటా విక్రయాలు కుదేలయ్యాయి. ఎంజీ మోటార్, రెనో ఇండియా ఆకట్టుకున్నాయి.
ఆగస్టులో వాహన అమ్మకాలు పెరిగాయ్ - passenger vehicles
కరోనా మహమ్మారితో కుదేలైన వాహన సంస్థలు ఆగస్టులో పుంజుకున్నాయి. గత నెలలో మారుతీ సుజుకీ 20.2 శాతం, హ్యుందాయ్ 19.9 శాతం మేర దేశీయ విక్రయాల్లో పెరుగుదల నమోదైంది. మరోవైపు మహీంద్రా, టయోటా విక్రయాలు కుదేలయ్యాయి.
మారుతీ సుజుకీ దేశీయ మొత్తం విక్రయాలు 1,06,413 నుంచి 17.1 శాతం వృద్ధి చెంది 1,24,624కు చేరాయి. ఆల్టో, ఎస్‌ప్రెసోలతో కూడిన చిన్నకార్ల విభాగం అమ్మకాలు 10,123 నుంచి 94 శాతం పెరిగి 19,709కు చేరాయి. స్విఫ్ట్, ఎస్టిలో, రిట్జ్, డిజైర్, బాలెనో లాంటి కాంపాక్ట్ కార్ల అమ్మకాలు 14.2 శాతం పెరిగి 54,274 నుంచి 61,956కు వృద్ధి చెందాయి. ఇక విటారా బ్రెజా, ఎస్-క్రాస్ వంటి యుటిలిటీ వాహన విక్రయాలు 13.5 శాతం అధికమై 21,030కు పెరిగాయి.
హ్యుందాయ్ దేశీయ విక్రయాలు పెరగ్గా, మొత్తం విక్రయాలు మాత్రం 6 శాతం తగ్గి 52,609కు పరిమితమయ్యాయి. మహీంద్రా ట్రాక్టర్ల అమ్మకాలు 65 శాతం పెరిగి 24,458 వాహనాలుగా నమోదయ్యాయి. కియా 10,845 కార్లు అమ్మింది. 2019 ఆగస్టులో మొత్తంగా 14,817 ట్రాక్టర్లను ఎంఅండ్‌ఎం విక్రయించింది. ద్విచక్రవాహన సంస్థల్లో హీరో అమ్మకాలు 7.55 శాతం పెరిగాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ 2 శాతం, సుజుకీ 15 శాతం, టీవీఎస్ 1 శాతం చొప్పున క్షీణత నమోదుచేశాయి.