అరబిందో ఫార్మా కొవిడ్-19 టీకా అభివృద్ధి చేయనుంది. దీని కోసం సీఎస్‌ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్)తో, కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ శాఖ సారథ్యంలోని బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బీఐఆర్‌ఏసీ)తో భాగస్వామ్యాలు కుదుర్చుకుంది.
సీఎస్‌ఐఆర్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం అరబిందో ఫార్మా కొవిడ్-19 టీకా తయారీ, విక్రయ కార్యకలాపాలపై దృష్టి సారిస్తుంది. సీఎస్‌ఐఆర్‌కు చెందిన పరిశోధనా సంస్థలైన సీసీఎంబీ- హైదరాబాద్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీ- చండీగఢ్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ- కోల్‌కతా, కొవిడ్-19 వ్యాక్సిన్‌పై విస్తృత స్థాయిలో పరిశోధనలు చేస్తున్నాయి. వేర్వేరు వ్యాక్సిన్ ప్లాట్‌ఫామ్‌లపై నిర్వహిస్తున్న ప్రయోగాలు విజయవంతమైతే టీకా తయారీ, విక్రయ బాధ్యతలను అరబిందో ఫార్మా చేపడుతుంది.
స్వతంత్రంగా టీకా అభివృద్ధి చేసి, ప్రజలకు అందించాలనే లక్ష్యసాధన దిశగా ఔషధాల తయారీలో విశేష అనుభవం ఉన్న అరబిందో ఫార్మాతో జట్టుకట్టినట్లు సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా పేర్కొన్నారు. మనదేశంలో తొలిసారిగా ‘ఆర్-వీఎస్‌వీ వ్యాక్సిన్’ మానుఫ్యాక్చరింగ్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటుకు బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బీఐఆర్‌ఏసీ)తో అరబిందో ఫార్మా భాగస్వామ్యం కుదుర్చుకుంది.