భారత్‌లో కరోనా సృష్టిస్తున్న విలయంపై మరో టెక్ దిగ్గజం యాపిల్ స్పందించింది. కష్టకాలంలో ఉన్న భారతీయులకు సాయమందించేందుకు ముందుకు వచ్చింది. క్షేత్ర స్థాయిలో మహమ్మారి నివారణకు జరుగుతున్న కార్యక్రమాలకు విరాళాల రూపంలో తమ వంతు సహకారం అందిస్తామని సంస్థ సీఈఓ టిమ్ కుక్ ప్రకటించారు.
"భారత్‌లో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతుండటం వల్ల వైద్యులు, కార్మికులు, యాపిల్ కుటుంబం సహా భయంకరమైన ఈ మహమ్మారితో పోరాడుతున్న ప్రతి ఒక్కరిపైనే మా ఆలోచనలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో సహాయక చర్యలకు మద్దతుగా యాపిల్ విరాళం ఇవ్వనుంది" అని టిమ్ కుక్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అయితే, ఏ రూపంలో, ఎంత మొత్తంలో సాయం చేయనున్నారనే దానిపై యాపిల్ నుంచి ప్రస్తుతానికి స్పష్టత రాలేదు. స్వచ్ఛంద సంస్థలు లేదా ప్రభుత్వానికే నేరుగా విరాళం అందించడంపై వివిధ వర్గాలతో సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం.