కరోనా వైరస్ కారణంగా ఐఫోన్ల ఉత్పత్తి, అమ్మకాలపై ప్రభావం పడుతుందని యాపిల్ సంస్థ తెలిపింది. రెండో త్రైమాసిక ఆర్థిక మార్గదర్శకాలను అందుకోలేకపోతున్నట్టు పెట్టుబడిదారులను హెచ్చరించింది.
"కరోనా వ్యాప్తి మొదలైన హుబే రాష్ట్రానికి దగ్గరలోనే ఐఫోన్ ఉత్పత్తి కేంద్రాలన్నీ ఉన్నాయి. ప్రస్తుతం అన్నింటినీ పునఃప్రారంభించాం. కానీ ఉత్పత్తి నెమ్మదిగా సాగుతోంది.
సంస్థలో పనిచేసేవారి ఆరోగ్యం కూడా ముఖ్యమే. మా ఉత్పత్తిదారులతో పాటు ప్రభుత్వ ఆరోగ్య నిపుణులతో కలిసి పనిచేస్తున్నాం. "
-యాపిల్ సంస్థ ప్రకటన
కరోనా కారణంగా ఐఫోన్ల ఉత్పత్తితో పాటు చైనాలో డిమాండ్ కూడా దెబ్బతిందని సంస్థ ప్రకటించింది. చైనాలోని యాపిల్ రిటైల్ దుకాణాలను చాలా వరకు మూసివేయడమే కారణమని తెలిపింది. అమెరికా, ఐరోపా తర్వాత యాపిల్‌కు మూడో అతిపెద్ద మార్కెట్ చైనా.
రెండో త్రైమాసికంలో 63 నుంచి 67 బిలియన్ డాలర్ల రెవెన్యూ సాధిస్తామని యాపిల్ జనవరి 28న అంచనాలను ప్రకటించింది. చైనాను మినహాయిస్తే ఇతర దేశాల్లో ఐఫోన్ డిమాండ్ బాగానే ఉన్నట్లు తెలిపింది సంస్థ.
కరోనా మహమ్మారి..
కరోనా వైరస్ మహమ్మారి వల్ల చైనాలో 1,860మంది మరణించారు. మృతుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతున్నప్పటికీ... ప్రపంచదేశాల్లో ఆందోళన కొనసాగుతూనే ఉంది.