లగ్జరీ గ్యాడ్జెట్స్ తయారీ సంస్థ యాపిల్ భారత మార్కెట్లో త్వరలో సొంత ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి ఈ-కామర్స్ సంస్థల భాగస్వామ్యంతో తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది యాపిల్. త్వరలో యాపిల్ ఉత్పత్తులు సొంత ఆన్‌లైన్ స్టోర్‌లోనే అందుబాటులోకి రానున్నాయని తెలిసింది.
సింగిల్ బ్రాండ్ రిటైల్ వాణిజ్యంపై ఎఫ్‌డీఐ నిబంధనలను సరళీకరిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ స్టోర్ అందుబాటులోకి తెచ్చేందుకు యాపిల్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం.
ఇంతకుముందు అడ్డంకులివే..
సింగిల్ బ్రాండ్ రిటైలర్లు ఇప్పటి వరకు భారత్‌లో స్టోర్లు మొదలుపెట్టాలంటే 30శాతం స్థానిక సోర్సింగ్ తప్పనిసరి. అంటే 51% వరకు ఎఫ్‌డీఐలున్న సింగిల్ బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్ సంస్థలు ఏటా 30 శాతం వరకు వస్తువులను దేశీయంగా సేకరించాలి. ఆఫ్‌లైన్ స్టోర్ అందుబాటులోకి వచ్చిన తర్వాతే ఆన్‌లైన్‌లో ఉత్పత్తులు విక్రయించాలి. దీని వల్ల చాలా విదేశీ కంపెనీలు సొంత బ్రాండ్లు భారత్‌కు తెచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నాయి.