యాపిల్ ఐఫోన్ల సరఫరా సంస్థ విస్ట్రాన్ భారత్ కార్యకలాపాల ఉపాధ్యక్షుడిని బాధ్యతల నుంచి తప్పించినట్లు శనివారం ప్రకటించింది. కర్ణాటక కోలార్ జిల్లా విస్ట్రాన్ ప్లాంట్లో ఈ నెల 12న జరిగిన విధ్వంసం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా.. చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.
'మా బృందాల భద్రత, శ్రేయస్సుకే ఎప్పుడూ మా ప్రథమ ప్రాధాన్యం. ఇవే కంపెనీ ముఖ్యమైన విలువలు' అని విస్ట్రాన్ పేర్కొంది.
ఇటీవల ప్లాంట్లో జరిగిన ఘటన దురదృష్టకరమని వెల్లడించింది విస్ట్రాన్. ఈ ఘటన ద్వారా కొంత మంది కార్మికులకు వేతనాలు అందలేదని, మరికొంత మందికి సరైన సమయానికి వేతనాలు రాలేదని గ్రహించినట్లు వివరించింది. ఈ నేపథ్యంలో తమ కార్మికులందరికీ క్షమాపణలు చెప్పింది విస్ట్రాన్.