యాపిల్ మొబైల్ కంపెనీకి బ్రెజిల్‌లో భారీ షాక్ తగిలింది. ఛార్జర్ లేకుండా ఐఫోన్ 12 మోడళ్లను విక్రయిస్తున్నందుకు అక్కడి వినియోగదారుల ఫోరం (ప్రోకాన్-ఎస్పీ) సుమారు ₹15 కోట్లు (2 మిలియన్ డాలర్లు) జరిమానా విధించింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించి ఛార్జర్ లేని మొబైళ్లను విక్రయించినందుకుగానూ ఈ జరిమానా విధిస్తున్నట్లు ఫోరం వెల్లడించింది.
ధర ఎందుకు తగ్గించలేదు?
పర్యావరణ హితం పేరుతో ఐఫోన్ 12 సిరీస్ మొబైళ్లకు పవర్ అడాప్టర్, హెడ్‌ఫోన్‌లు లేకుండా కేవలం ఛార్జింగ్ కేబుల్ మాత్రమే ఇస్తున్నట్లు యాపిల్ అక్టోబర్‌లో ప్రకటించింది. ఐఫోన్ 12 మినీ ధర యూఎస్‌లో 729 డాలర్లు ఉంది. బ్రెజిల్‌లో దీనిని 1200 డాలర్లకు విక్రయిస్తోంది. అయితే ఫోన్‌కు ఛార్జర్, హెడ్‌సెట్ ఇవ్వకపోవడం వల్ల వినియోగదారులు నష్టపోతున్నారని బ్రెజిల్ వినియోగదారుల ఫోరం పేర్కొంది. ఛార్జర్ ఇవ్వకుండా ఫోన్ విక్రయించడం సమంజసం కాదంటూనే, ధర ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించింది. దీనిపై యాపిల్ ఇంకా స్పందించలేదు.