తెలంగాణ

telangana

ETV Bharat / business

జట్టుకట్టిన అంబానీ, బియానీ- ఒప్పందం ఖరారు - INR 24,713 crore

రిలయన్స్​ ఇండస్ట్రీస్, ఫ్యూచర్ గ్రూప్​ల మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఫ్యూచర్ వ్యాపారాలను రూ. 24,713 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు రిలయన్స్ ప్రకటించింది. ఎప్పటినుంచో రిటైల్‌రంగంలో మార్కెట్‌ లీడర్‌గా మారాలన్న రిలయన్స్‌ కల ఈ ఒప్పందంతో నెరవేరే అవకాశం ఉంది.

Ambani's Reliance buys stake in Future Group for Rs 24,713 cr
ఫ్యూచర్​-రిలయన్స్ మధ్య ఒప్పందం ఖరారు

By

Published : Aug 29, 2020, 9:39 PM IST

Updated : Aug 29, 2020, 9:49 PM IST

కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్, ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఫ్యూచర్‌ రిటైల్‌ వ్యాపారాలను రిలయన్స్​ దక్కించుకుంది. రూ. 24,713 కోట్లకు సంస్థ వాటాలు కొనుగోలు చేసినట్లు రిలయన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో రిటైల్ రంగంలో దూసుకెళ్తున్న రిలయన్స్​.. అమెజాన్ వంటి ఈ-కామర్స్ దిగ్గజాలకు పోటీగా ఎదిగే అవకాశం లభించనుంది.

"రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్​ఐఎల్) అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌వీఎల్) ఫ్యూచర్​ గ్రూప్​కి చెందిన రిటైల్, హోల్​సేల్ వ్యాపారాలు, లాజిస్టిక్, గిడ్డంగుల వ్యాపారాలను రూ. 24,713 కోట్లకు సొంతం చేసుకోనుంది."

-రిలయన్స్ ప్రకటన

ఇదీ ఒప్పందం..

ఫ్యూచర్‌ గ్రూప్‌ తొలుత తన అయిదు యూనిట్లయిన నిత్యావసరాలు, దుస్తులు, సరఫరా వ్యవస్థ, వినియోగదారు వ్యాపారాలను.. ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌(ఎఫ్‌ఈఎల్‌)లో విలీనం చేస్తుంది. ఆ తర్వాత ఎఫ్‌ఈఎల్‌ అన్ని రిటైల్‌ ఆస్తులను ఏకమొత్తంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు విక్రయిస్తుందని ఈ పరిణామాలతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. రిలయన్స్‌ రిటైల్‌కు దుస్తులు, నిత్యావసరాలను దీర్ఘకాలం పాటు సరఫరా చేసే ఒప్పందాన్ని కూడా ఎఫ్‌ఈఎల్‌ కుదుర్చుకోవచ్చు.

ఫ్యూచర్‌ గ్రూప్‌ ఎందుకు అమ్మాల్సి వస్తోందంటే..

ఈ ఒప్పందం ద్వారా తనకున్న భారీ అప్పుల నుంచి బయటపడాలని ఫ్యూచర్‌ గ్రూప్‌ భావిస్తోంది. మార్చి 31, 2019 నాటికి రూ.10,951 కోట్లుగా ఉన్న కంపెనీ అప్పులు సెప్టెంబరు 30, 2019నాటికే రూ.12,778 కోట్లకు చేరుకున్నాయి. ఈ మార్చి కల్లా కొన్ని బకాయిలను తీర్చాల్సి ఉంది. అయితే ఆర్‌బీఐ మారటోరియం కొంత ఊపిరినిచ్చింది. ఫిబ్రవరి నుంచే గ్రూప్‌ కంపెనీలు రుణాన్ని తీర్చలేని పరిస్థితికి వచ్చాయి. దీంతో బియానీకిచ్చిన రుణాలకు మరిన్ని షేర్లు తనఖా పెట్టాలని రుణదాతలు ఒత్తిడి పెంచారు. ఆలోచనల పుట్టగా పేరున్న బియానీ.. క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేయడంలో విఫలం కావడంతో పాంటలూన్‌ రిటైల్‌ను ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు; ఫ్యూచర్‌ క్యాపిటల్‌ను వార్‌బర్గ్‌ పింకస్‌కు విక్రయించుకోవాల్సి వచ్చింది. ఇపుడూ రుణాలు తీర్చడానికే ఈ విక్రయం.

రిలయన్స్‌కు ఏంటి లాభం..

ఎప్పటినుంచో రిటైల్‌రంగంలో మార్కెట్‌ లీడర్‌గా మారాలన్న రిలయన్స్‌ కల ఈ ఒప్పందంతో నెరవేరుతుంది. గత ఆర్థిక సంవత్సరం రూ.1.63 లక్షల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసిన రిలయన్స్‌ రిటైల్‌కు ఫ్యూచర్‌ గ్రూప్‌తో ఒప్పందం ద్వారా భారత్‌లోని సంస్థాగత రిటైల్‌ మార్కెట్లో మూడో వంతు కంటే అధిక మార్కెట్‌ వాటా లభిస్తుంది. అంతేకాదు పోటీదార్లపై గట్టి ఒత్తిడిని పెంచవచ్చు. ముఖ్యంగా అమెరికాకు చెందిన అమెజాన్‌ ఇండియాకు ఈ-కామర్స్‌ విభాగంలో గట్టి పోటీ ఇవ్వవచ్చు.

Last Updated : Aug 29, 2020, 9:49 PM IST

ABOUT THE AUTHOR

...view details