ఇండియాలో అత్యంత సంపన్నులు అనగానే మనకు గుర్తొచ్చే పేరు అంబానీలు. గత కొంత కాలంగా అంబానీ సోదరుల మధ్య సంపద అంతరం అమాంతం పెరిగిపోయింది. అన్న ముకేశ్సంపద పెరగగా... తమ్ముడు అనిల్ అంబానీ సంపద తరిగిపోయింది.
ఎరిక్సన్ అనే స్వీడన్ కంపెనీకి రిలయన్స్ కమ్యూనికేషక్స్ చెల్లించాల్సిన బకాయి విషయంలో తమ్ముడిని జైలు శిక్ష పడకుండా కాపాడారు ముకేశ్ అంబానీ. ఇది అంబానీల మధ్య కొత్త సంబంధాలకు తొలిమెట్టుగా అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. భవిష్యత్తులో ఇద్దరూ కలిసి పనిచేసే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.
ఇటీవల ముకేశ్ అంబానీ వారసుల పెళ్లిలో అనిల్ అంబానీ ఆనందంగా గడిపారు. కష్ట సమయాల్లో తనవైపు ఉండి కుటుంబం విలువ తెలియజేశారని అప్పుడు వ్యాఖ్యానించారు.
జైలు శిక్ష పడకుండా అన్న సహాయం..
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్)... ఎరిక్సన్ సంస్థకు భారీగా బకాయి పడింది. దీనిని 19 మార్చి వరకు చెల్లించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. చెల్లించకుంటే మూడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
బాకీతో పాటు వడ్డీ కలిపి మొత్తం రూ.550 కోట్లను గడువుకు ఒక్క రోజు ముందు అనగా సోమవారం నాడు చెల్లించారు అనిల్ అంబానీ. దీనిలో 458 కోట్లు ముకేశ్ అంబానీ అందించినట్లు తెలిపారు. అన్నా, వదినలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ చెల్లింపు పూర్తయిన వెంటనే అన్నకు అనుకూలంగా ఉండే నిర్ణయాన్ని తీసుకున్నారు తమ్ముడు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ స్పెక్ట్రమ్, ఫైబర్, టవర్ల బిజినెస్‌ను ముకేశ్ అంబానీకి రూ.17,000 కోట్లకు విక్రయించటానికి ఉద్దేశించిన ఒప్పందాన్ని రద్దు చేశారు అనిల్. ఈ ఆస్తులన్నింటిని దివాలా బిల్లు ప్రకారం విక్రయించనున్నారు. ఇందులో రిలయన్స్ జియోనే ప్రధాన బిడ్డర్‌గా ఉండే అవకాశం ఉంది.
తండ్రి మరణంతో మొదలైన ఘర్షణ...
తండ్రి దీరుభాయ్ అంబానీ ఎలాంటి వీలునామా రాయకుండా 2002లో మరణించటంతో సోదరుల మధ్య వివాదం చెలరేగింది. మూడు సంవత్సరాల అనంతరం ఆస్తులను పంచుకున్నారు. ఆయిల్, ఫార్మా వ్యాపారాన్ని ముకేశ్ అంబానీ కైవసం చేసుకోగా... విద్యుచ్ఛక్తి, టెలికాం, ఆర్థిక సేవలు లాంటి నవీన వ్యాపారాలను అనిల్ అంబానీ దక్కించుకున్నారు.
తండ్రి కంపెనీల్లో ఉన్నత హోదాల్లో పనిచేసిన ఈ సోదరులు...దాదాపు సమాన విలువ గల ఆస్తులను పొందారు. అప్పటితో ఘర్షణలు ఆగలేదు. విద్యుతుత్పత్తి కేంద్రాలకు బొగ్గు సరఫరా చేయాలన్న ఒప్పందాన్ని ముకేశ్ అంబానీ ఉల్లంఘించారని అనిల్ అంబానీ కోర్టుకు వెళ్లారు. సుప్రీం కోర్టు ముకేశ్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించింది.
దక్షిణాఫ్రికాకు చెందిన ఎమ్‌టీఎన్‌తో రిలయన్స్ కమ్యూనికేషన్స్ విలీనాన్ని తనకున్న తిరస్కరించే హక్కుతో 2008లో ఆపారు ముకేశ్ అంబానీ.
అప్పటి నుంచి సోదరుల సంపదలో భారీ మార్పులు వచ్చాయి. ముకేశ్ అంబానీకి చెందిన ఆయిల్, గ్యాస్ వ్యాపారం వికసించింది. వ్యాపార విస్తరణలో పెట్టుబడులు పెట్టటంతో అనిల్ అంబానీకి చెందిన టెలికాం, విద్యుచ్ఛక్తి వ్యాపారం అప్పుల్లో కూరుకుపోయింది. రుణాలు భారీగా పెరగటంతో పాటు పోటీ పెరగటంతో అనిల్ అంబానీ వ్యాపారం దెబ్బతింది.
ఆరో స్థానం నుంచి ఆఖరుకి...
31 బిలియన్ డాలర్లతో 2008 ఫోర్బ్స్ ప్రపంచ సంపన్నుల జాబితాలో ఆరోస్థానంలో నిలిచారు అనిల్ అంబానీ. బ్లూమ్‌బర్గ్ గణాంకాల ప్రకారం... ప్రస్తుతం ఈ సంపద 300 మిలియన్ డాలర్లకు తగ్గింది. ప్రస్తుతం ముకేశ్ సంపద 54.3 బిలియన్ డాలర్లు. ఇది ఒక్క సంవత్సరంలో 10 బిలియన్ డాలర్లు పెరగటం విశేషం.
ఒకరు ఉన్న వ్యాపారంలోకి మరొకరు పోటీగా రాకూడదన్న ఒప్పందాన్ని(పోటీ వ్యాపారం) అన్నదమ్ములు 2010లో రద్దు చేసుకున్నారు. ఇది రిలయన్స్ జియోకు దారులు తెరిచింది. ఆ తరువాత జియో భారత్‌లో భారీ వ్యాపారాన్ని సొంతం చేసుకుంది.
ముకేశ్ అంబానీ సంపద పెరుగుతున్న వేళ... మరోవైపు పెట్టుబడిదారుల ఒత్తిడి మేరకు అనిల్ అంబానీ ఆస్తులను విక్రయించటం ప్రారంభించారు. రుణాల భారం పెరిగింది. రూ. 17 వేల కోట్ల రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆస్తులను జియోకు విక్రయించేందుకు 2017 డిసెంబర్లో ఒప్పందం చేసుకున్నారు అనిల్.
ఈ ఒప్పందాన్ని ఆమోదించాలంటే స్పెక్ట్రమ్ ఫీజులు ఎవరు చెల్లిస్తారన్న దానిపై రాతపూర్వక హామీ ఇవ్వాలని టెలికమ్యూనికేషన్స్ విభాగం కోరింది. జియో దీన్ని తిరస్కరించటం మూలంగా ఒప్పందం పురోగతి సాధించలేదు.