ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌తో వివాదం విషయంలో ఫ్యూచర్ రిటైల్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. అమెజాన్‌కు అనుకూలంగా సుప్రీం కీలక తీర్పు వెలువరించింది. ఫ్యూచర్ గ్రూప్.. రిలయన్స్ రిటైల్‌తో చేసుకున్న రూ.24,713 కోట్ల ఒప్పందాన్ని నిలిపివేస్తూ సింగపూర్‌కు చెందిన ఎమర్జెన్సీ ఆర్బిటరేటర్ ఇచ్చిన తీర్పును అమలు చేయాలన్న అమెజాన్ వాదనను సుప్రీం సమర్థించింది. ఆ ఆదేశాలు భారత్‌లో చెల్లుబాటవుతాయని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
అసలు ఏమిటి ఈ వివాదం..
ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ గత ఏడాది ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ రూ.24,713 కోట్లు.
అంతకు ముందే.. ఫ్యూచర్ గ్రూప్‌కు చెందిన ఫ్యూచర్ కూపన్స్ లిమిటెడ్‌లో అమెజాన్ 2019లో 49 శాతం మేర పెట్టుబడులు పెట్టింది. ఫ్యూచర్ కూపన్స్‌కు 7.3 శాతం మేర ఫ్యూచర్ రిటైల్‌లో వాటా ఉంది. దీంతో మూడేళ్ల నుంచి 10 ఏళ్లలోపు ఫ్యూచర్ రిటైల్‌ను కొనుగోలు చేసే హక్కు అమెజాన్‌కు దఖలు పడింది. అంటే పరోక్షంగా ఫ్యూచర్ రిటైల్‌లో అమెజాన్‌కు కూడా యాజమాన్య హక్కులు ఉన్నాయి.
రిలయన్స్-ఫ్యూచర్ మధ్య కుదిరిన ఒప్పందం తమ హక్కులను ఉల్లంఘిస్తోందని అమెజాన్ వాదించింది. దీనిపై సింగపూర్ మధ్యవర్తిత్వ కోర్టులో ఈ ఒప్పందాన్ని సవాల్ చేసింది. ఆ కోర్టు రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ డీల్‌పై స్టే విధించింది. తుది తీర్పు వెలువడే వరకు ఒప్పందంపై ముందుకెళ్లొద్దని ఆదేశించింది.
విదేశీ మధ్యవర్తిత్వ కోర్టు తీర్పులు భారత్‌లో చెల్లుబాటు కావని ఫ్యూచర్ గ్రూప్ వాదిస్తూ వచ్చింది. దీంతో మధ్యర్తిత్వ కోర్టు తీర్పును అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ అమెజాన్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ఏకసభ్య ధర్మాసనం తొలుత అమెజాన్‌కు అనుకూలంగా తీర్పును వెలువరించింది. ఈ తీర్పును ఫ్యూచర్ గ్రూప్ అదే కోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన విస్తృత ధర్మాసనం మునుపటి తీర్పును తిరగరాస్తూ.. ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లొచ్చని స్పష్టం చేసింది.
దిల్లీ హైకోర్టు తదుపరి తీర్పుతో సంతృప్తి చెందని అమెజాన్.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై వాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం జులై 29న తీర్పును రిజర్వ్ చేసి.. తాజాగా అమెజాన్‌కు అనుకూలంగా వెలువరించింది.
ఈ వివాదంపై విచారణను 'ది సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్ఐఏసీ)' గత నెలలో పూర్తి చేసింది. ఫ్యూచర్ గ్రూప్ తరఫున సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే, అమెజాన్ తరఫున సీనియర్ అడ్వకేట్ గోపాల్ సుబ్రమణియమ్ వాదించారు. ఈ నెలలో దీనిపై తుది తీర్పు వెలువడే అవకాశం ఉందని సమాచారం.
ఇదీ చదవండి:కిశోర్ బియానీపై ఏడాది పాటు నిషేధం