రిలయన్స్- ఫ్యూచర్ గ్రూప్ మధ్య కుదిరిన ఒప్పందం చిక్కుల్లో పడింది. ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన డీల్‌ను సవాలు చేస్తూ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. ఫ్యూచర్ గ్రూప్‌నకు లీగల్ నోటీసులు పంపింది.
గతంలో తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఫ్యూచర్ గ్రూప్ ఉల్లంఘించిందని అమెజాన్ ఆరోపించింది. తమ ఒప్పంద హక్కులను పొందేందుకు చర్యలు ప్రారంభించామని తెలిపింది. ప్రస్తుతం ఈ విషయం న్యాయస్థానంలో ఉన్న కారణంగా ఇతర వివరాలు వెల్లడించలేమని స్పష్టం చేసింది.
నోటీసులు అందిన విషయాన్ని ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన సలహాదారు ఒకరు ధ్రువీకరించారు. ఈ సమస్యను మధ్యవర్తిత్వం లేదా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.
పడిపోయిన షేర్లు..
అమెజాన్ లీగల్ నోటీసులు పంపిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు పడిపోయాయి. అమ్మకాల ఒత్తిడి కారణంగా దాదాపు 1 శాతం రిలయన్స్ షేర్లు నష్టపోయాయి. ఫ్యూచర్ గ్రూప్ షేర్లపైనా అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఫ్యూచర్ గ్రూప్‌లోని కొన్ని ప్రధాన కంపెనీల షేర్లు 5 శాతం మేర నష్టపోయాయి.