ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా.. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ద్వారా వస్తువులు డెలివరీ చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా 2025 నాటికి 10,000 ఎలక్ట్రిక్ వాహనాలను డెలివరీల కోసం వినియోగించనున్నట్లు సంస్థ ప్రకటించింది.
ఎలక్ట్రిక్ వాహనాలను 2019 నుంచి దేశంలోని పలు పట్టణాల్లో ప్రయోగాత్మకంగా వినియోగిస్తుండగా.. ఇప్పుడు విస్తరణకు సిద్ధమైనట్లు అమెజాన్ ఇండియా వెల్లడించింది. ఈ ఏడాది.. హైదరాబాద్, దిల్లీ (జాతీయ రాజధాని ప్రాంతం), బెంగళూరు, అహ్మదాబాద్, పుణె, నాగ్‌పుర్,కోయంబత్తూర్ సహా 20 పట్టణాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించనుంది అమెజాన్. 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా లక్ష ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలన్న ప్రణాళికకు.. అదనంగా తాజా ప్రకటన చేసింది అమెజాన్.