తెలంగాణ

telangana

ETV Bharat / business

'పెట్టుబడులపై నేనన్న మాటలు వక్రీకరించారు' - అమెజాన్​పై పీయూష్ గోయల్ విమర్శలు

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్​ను ఉద్దేశిస్తూ కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు. అమెజాన్​కు వ్యతిరేకంగా తాను ఎలాంటి విమర్శలు చేయలేదని పీయూష్​ అన్నారు. కేవలం చిన్న వ్యాపారుల ప్రయోజనాలు దెబ్బతీసేలా పెట్టుబడులు ఉండొద్దని మాత్రమే తాను తెలిపినట్లు వెల్లడించారు.

GOYAL
పీయూష్​ గోయల్​

By

Published : Jan 17, 2020, 9:24 PM IST

అమెజాన్‌పై పరోక్షంగా విమర్శలు చేసిన.. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ వెనక్కి తగ్గారు. పెట్టుబడులపై తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన వెల్లడించారు. అమెజాన్‌కు వ్యతిరేకంగా తాను ఎలాంటి విమర్శలు చేయలేదని పీయూష్‌ గోయల్‌ స్పష్టం చేశారు.

దేశంలోకి నిబంధనల ప్రకారమే పెట్టుబడులు రావాలని తాను చెప్పానని.. చట్టానికి లోబడి వచ్చే అన్ని రకాల పెట్టుబడులను స్వాగతిస్తామని పేర్కొన్నారు. భారత్‌లో చిరు వ్యాపారులకు నష్టం చేసే పోటీని సృష్టించకూడదన్న గోయల్‌ వారికి సులువుగా రుణాలు లభించవని తెలిపారు. భారీ పెట్టుబడులు చిన్న వ్యాపారుల ప్రయోజనాలు దెబ్బతీసేలా ఉండకూడదని చట్టాలు స్పష్టం చేస్తున్నాయన్న కేంద్రమంత్రి.. తాను ఆ ఉద్దేశంతోనే వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చారు.

గోయల్​ అంతకు ముందు ఏమన్నారంటే..

రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టినంత మాత్రాన భారత్‌కు మీరేదో మేలు చేస్తున్నట్లు అవ్వదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్​ గోయల్‌ పరోక్షంగా బెజోస్‌ను ఉద్దేశిస్తూ అన్నారు. 'అమెజాన్‌ భారత్‌లో రూ.వేల కోట్లు పెట్టుబడులు పెట్టి ఉండవచ్చు. మళ్లీ ఏటా రూ.వేల కోట్లలో నష్టాలను ప్రకటిస్తున్నారు. అయినా కూడా తిరిగి పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అంటే ఇక్కడ మీరు రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టేది మీ కోసం కానీ.. భారత్‌ కోసమేమీ కాద'ని ఓ కార్యక్రమంలో అన్నారు. ఓ దిగ్గజ ఈ-కామర్స్‌ సంస్థకు అంత భారీ నష్టాలు రావడం ఆశ్చర్యమేస్తోందని, దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

అమెజాన్ అధినేత జెఫ్​ బెజోస్ భారత్​లో వచ్చే ఐదేళ్లలో సుమారు రూ.7,000 కోట్లు (1 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడిగా పెట్టనున్నట్లు ప్రకటించారు. భారత పర్యటనలో భాగంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రకటనపై పరోక్షంగా గోయల్ విమర్శలు చేయడం చర్చకు దారి తీసింది.

ఇదీ చూడండి:బెజోస్ ప్రకటన పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి

ABOUT THE AUTHOR

...view details