దిగ్గజ మదుపరి రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా(Rakesh Jhunjhunwala Airlines) నేతృత్వంలో ఏర్పాటు కానున్న కొత్త విమానయాన సంస్థ 'ఆకాశ ఎయిర్' రెండు రోజుల వ్యవధిలో మరో భారీ ఒప్పందం కుదుర్చుకొంది. భారత్‌లో సేవలను ప్రారంభించడం కోసం అమెరికాకు చెందిన విమాన తయారీ కంపెనీ బోయింగ్‌కు 72 '737 మాక్స్'(Akasa Airlines Jhunjhunwala) విమానాలకు మంగళవారం ఆర్డరు చేసిన విషయం తెలిసిందే. ఆ విమానాలకు కావాల్సిన ఇంజిన్ల కోసం నేడు సీఎఫ్‌ఎం ఇంటర్నేషనల్‌తో ఒప్పందం కుదుర్చుకొంది.
కొనుగోలు సర్వీసుతో కూడిన ఈ ఒప్పంద విలువ 4.5 బిలియన్ డాలర్లు(సుమారు రూ.33,000 కోట్లు). ప్రస్తుతం దుబాయిలో జరుగుతున్న ఎయిర్‌షోలో ఈ డీల్ ఖరారైంది. దీంతో సీఎఫ్‌ఎం లీప్-1బీ ఇంజిన్లను సీఎఫ్‌ఎం అందించనుంది. '737' మాక్స్‌లోని రెండు వేరియంట్లు 737-8, 737-7-200 విమానాల కోసం ఆర్డరు పెట్టినట్లు ఆకాశ ఎయిర్ మంగళవారం తెలిపింది. ఈ ఆర్డరు విలువ దాదాపు 9 బిలియన్ డాలర్లు(సుమారు రూ.67,500 కోట్లు).