దేశీయ టెలికాం సంస్థలు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియా, టాటా టెలిసర్వీసెస్లు సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిల చెల్లింపునకు సిద్ధమయ్యాయి. ఈ మూడు సంస్థలు సోమవారం నాడు బకాయిలు చెల్లించాలని భావిస్తున్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది.
ఇటీవలి లెక్కల ప్రకారం ఈ మూడు సంస్థల ఏజీఆర్ బకాయి మొత్తం రూ.లక్ష కోట్లుగా ఉంది. అయితే అందులో కొంత మొత్తం మాత్రమే ప్రస్తుతానికి చెల్లించనున్నట్లు సమాచారం.
కోర్టు ఆగ్రహంతో కసరత్తు ముమ్మరం..
ఏజీఆర్ బాకాయిలు చెల్లించాల్సిందేనని.. ఎలాంటి గడువు పెంచే యోచన లేదని సుప్రీంకోర్టు గత వారం ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో టెలికాం సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కోర్టు తీర్పు నేపథ్యంలో.. ఫిబ్రవరి 20న రూ.10,000 కోట్ల ఏజీఆర్ బకాయిలు చెల్లిస్తామని ఎయిర్టెల్ తెలిపింది. అయితే బకాయిల చెల్లింపునకు టెల్కోలకు ఎలాంటి గడువు పెంచే యోచన లేదని టెలికాం శాఖ (డీఓటీ) స్పష్టం చేసిన విషయం విదితమే.