ఏజీఆర్ బకాయిల చెల్లింపుపై భారతి ఎయిర్టెల్ స్పందించింది. ఈ నెల 20లోపు రూ.10వేల కోట్లు చెల్లిస్తామని టెలికాం శాఖకు తెలిపింది. టెలికాం శాఖ తాజా ఆదేశాల నేపథ్యంలో ఈ మేరకు వివరణ ఇచ్చింది ఎయిర్టెల్.
"ఈ రోజు సుప్రీంకోర్టు నిర్దేశం ప్రకారం 2020 ఫిబ్రవరి 20లోపు రూ.10వేల కోట్లు డిపాజిట్ చేస్తాం. మిగిలిన బకాయిలు సుప్రీం కోర్టు తదుపరి విచారణ కన్నా ముందే చెల్లిస్తాం."
-భారతి ఎయిర్టెల్
సుప్రీం కోర్టు ఆగ్రహంతో ఏజీఆర్ బకాయిల ఈ రోజే చెల్లించాలని టెలికాం శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎయిర్టెల్ ఈ మేరకు స్పందించింది.
ఏజీఆర్ కింద టెలికాం శాఖకు ఎయిర్టెల్ రూ.35,586 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎయిర్టెల్తోపాటు వొడాఫోన్-ఐడియా, టాటా టెలీసర్వీసెస్ తదితర టెల్కోలు కలిసి మొత్తం రూ.1.47 లక్షల కోట్లు బకాయి ఉన్నాయి. 2020 జనవరి 23లోపు ఈ బకాయిలు చెల్లించాలని గతేడాది అక్టోబర్ 24న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.