తెలంగాణ

telangana

ETV Bharat / business

'మొబైల్​ డేటా ఛార్జీలు 7-8 రెట్లు పెంచాలి' - వ్యాపార వార్తలు

ఏజీఆర్​ బకాయిలు చెల్లించాల్సిందేనని సుప్రీం ఇచ్చిన తీర్పుతో వొడాఫోన్ ఐడియా పీకల్లోతు సంక్షోభంలో మునిగింది. ఆ సంస్థ మొత్తం రూ.53 వేల కోట్ల ఏజీఆర్​ బకాయిలు చెల్లించాల్సి ఉండగా అందులో కేవలం 7 శాతం మాత్రమే ఇప్పటి వరకు చెల్లించింది. మిగత మొత్తాన్ని తాము చెల్లించే స్థితిలో లేమని మరో సారి తమ నిస్సహాయతను టెలికాం విభాగం (డాట్​)కు లేఖ రాసింది. వీటితో పాటు డేటా ఛార్జీల పెంపు ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది.

Voda Idea wants 7-8 times hike in mobile data tariffs
వొడాఫోన్​ ఐడియా

By

Published : Feb 28, 2020, 8:07 AM IST

Updated : Mar 2, 2020, 8:04 PM IST

సవరించిన స్థూల ఆదాయ (ఏజీఆర్‌) బకాయిల చెల్లింపుల విషయంలో వొడాఫోన్‌ ఐడియా మరోసారి తన అశక్తత ప్రకటించింది. సంక్షోభంలో చిక్కుకున్న టెలికాం రంగానికి ప్రభుత్వం తక్షణ ఉపశమన చర్యలు ప్రకటిస్తే మినహా, పూర్తి బకాయిలు చెల్లించడం ఇప్పుడైతే తమ వల్ల కాదని టెలికాం విభాగానికి (డాట్‌) రాసిన లేఖలో స్పష్టం చేసింది. ఏజీఆర్‌ బకాయిల కింద రూ.53 వేల కోట్లు వొడాఫోన్‌ ఐడియా చెల్లించాల్సి ఉంది. ఇందులో కేవలం 7 శాతం మాత్రమే ఇప్పటి వరకు చెల్లించామని లేఖలో ఆ కంపెనీ పేర్కొంది. ఇంకా పలు డిమాండ్లను కూడా ప్రభుత్వం ముందు పెట్టినట్లు తెలుస్తోంది.

సడలింపులు ఇవ్వండి: కాయ్‌

ఏజీఆర్‌ బకాయిల చెల్లింపుల విషయంలో కొన్ని సడలింపులు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కాయ్‌ (సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా) కోరింది. తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇవ్వడం, ఫ్లోర్‌ ధరల విధానాన్ని తక్షణమే అమలు చేయడం లాంటివి అడిగింది. ‘కొత్తగా గ్యారంటీలు ఇచ్చేందుకు/ప్రస్తుత గ్యారంటీలను కొనసాగించేందుకు బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. బకాయిలు చెల్లించమని పదే పదే టెలికాం సంస్థలను బ్యాంకులు అడుగుతున్నాయ’ని టెలికాం కార్యదర్శి అన్షు ప్రకాశ్‌కు రాసిన లేఖలో కాయ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ మ్యాథ్యూస్‌ తెలిపారు.

నేడు డీసీసీ సమావేశం!

టెలికాం కంపెనీలకు ఎటువంటి ఉపశమన చర్యలు ప్రకటించాలనే విషయంపై నేడు డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌ (డీసీసీ) సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. బకాయిలను విడతలవారీగా చెల్లించేందుకు వీలు కల్పించడం సహా పలు చర్యలపై ఇందులో చర్తిస్తారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

ఇవీ వొడాఫోన్‌ ఐడియా డిమాండ్లు

  • మొబైల్‌ డేటా ఛార్జీలను ప్రస్తుతంతో పోలిస్తే 7-8 రెట్లు పెంచాలి
  • ఏప్రిల్‌ 1 నుంచి నెలవారీ మొబైల్‌ కనెక్షన్‌ ఛార్జీని రూ.50 నిర్ణయించాలి
  • ప్రస్తుతం 1 జీబీ డేటాకు రుసుము రూ.4-5 మాత్రమే. దీన్ని రూ.35 చేయాలి
  • అవుట్‌గోయింగ్‌ కాల్స్‌ ఛార్జీని నిమిషానికి కనీసం 6 పైసలుగా నిర్ణయించాలి
  • లైసెన్సు రుసుమును ప్రస్తుత 8 శాతం నుంచి 3 శాతానికి తగ్గించాలి
  • స్పెక్ట్రమ్‌ వినియోగ ఛార్జీలను శూన్య స్థాయికి లేదా అన్ని స్పెక్ట్రమ్‌లకు ఒకేలా ఒక శాతంగా నిర్ణయించాలి.
  • ఏజీఆర్‌ బకాయిల వడ్డీ, జరిమానా చెల్లింపునకు మూడేళ్ల మారటోరియంతో సహా మొత్తం బకాయిల చెల్లింపునకు 18 ఏళ్ల గడువు కావాలి.
  • ప్రభుత్వం వద్ద ఉన్న రూ.8,000 కోట్ల విలువైన జీఎస్‌టీ క్రెడిట్‌ను సర్దుబాటు చేసుకునేందుకు కేంద్రం అనుమతినిస్తే.. తాము లెక్కగట్టిన ఏజీఆర్‌ బకాయిల అసలులో మిగతా మొత్తాన్ని చెల్లిస్తామని తెలిపింది.

అవి తీర్చలేని డిమాండ్లు

టెలికాం టారిఫ్‌లను డిసెంబరులోనే కంపెనీలు 50 శాతం మేర పెంచిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు పెంచాలని వొడాఫోన్‌ ఐడియా కోరుతుండటం గమనార్హం. డేటా, కాల్‌ రేట్లను మళ్లీ పెంచితే.. 2015-16లో వొడాఫోన్‌, ఐడియాలు ఎంతైతే ఆదాయాన్ని ఆర్జించేవో, ఆ మేరకు ఆదాయాన్ని మూడేళ్ల తరవాత ఆర్జించొచ్చని కంపెనీ భావిస్తున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అందుకే బకాయిల చెల్లింపునకు మూడేళ్ల మారటోరియం అడిగిందని వెల్లడించాయి. ఈ విషయంపై స్పందించేందుకు వొడాఫోన్‌ ఐడియా అధికార ప్రతినిధి నిరాకరించారు. అయితే ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వం ఈ డిమాండ్లు తీర్చడం అసాధ్యమైన పని అని ఒక అధికారి పేర్కొన్నారు.

ఇదీ చూడిండి:4జీ రాకతో పెరిగిన స్పీడు.. నెలకు 11జీబీ వాడేస్తున్నాం

Last Updated : Mar 2, 2020, 8:04 PM IST

ABOUT THE AUTHOR

...view details