Aditya Birla Sun life CEO interview: 'కరోనా తర్వాత ఆర్థిక రక్షణ కల్పించే పాలసీలకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. వినూత్నంగా ఉంటూ.. వ్యక్తిగత అవసరాలకు సరిపోయేలా ఉండే పాలసీలనే వినియోగదారులు ఇష్టపడుతున్నారు. బీమా రంగ వృద్ధిపై ఇది సానుకూల ప్రభావాన్ని చూపిస్తోంది' అని అంటున్నారు ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ కమలేశ్ రావు. 'ఈనాడు'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏమంటున్నారంటే...
బీమా పాలసీలను ఎంచుకునే విధానంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి?
కొవిడ్ మహమ్మారి.. ప్రజల జీవితంలో అనుకోని అనిశ్చితికి కారణమయ్యింది. ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రెండేళ్ల కాలంలో ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు, ఆర్థికంగా రక్షణ ఏర్పాటు చేసుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ సమయంలో జీవిత బీమా పాలసీలే కీలక భూమిక పోషించాయని చెప్పొచ్చు. పూర్తిగా రక్షణకే పరిమితమైన టర్మ్ పాలసీలకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. రాబడికి హామీ ఉన్న పాలసీలకూ ఆదరణ లభిస్తోంది. ఆర్థిక రక్షణ, భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఈ పాలసీలను ఎంచుకుంటున్నారు. యులిప్‌లవైపు చూస్తున్న వారి సంఖ్య కాస్త తగ్గింది. కేవలం పన్ను ఆదా కోసం పాలసీ అనే ధోరణీ మారింది.
కొత్త ఏడాదిలో బీమా పాలసీల్లో ఎలాంటి ఆవిష్కరణలు వచ్చేందుకు వీలుంది?
Innovation in insurance industry: ఒకే పాలసీ అందరికీ సరిపోతుంది అనే భావన ప్రస్తుత పరిస్థితుల్లో నప్పడం లేదు. ఇప్పుడు పాలసీదారులు తమకు తగినంత రక్షణ కల్పించడంతో పాటు, ప్రత్యేక పరిస్థితుల్లోనూ భరోసా ఇవ్వాలని కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగానే బీమా సంస్థలు మరింత వ్యక్తిగత పాలసీల ఆవిష్కరణకు చూస్తున్నాయి. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) సైతం ఇలాంటి వినూత్న పాలసీలను ప్రోత్సహిస్తోంది. ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో.. ఆరోగ్యకర జీవన శైలి పాటించే పాలసీదారులకు మరిన్ని ప్రయోజనాలు అందించేందుకు బీమా సంస్థలు ముందుకు వస్తున్నాయి. వచ్చే ఏడాది నుంచి రీ ఇన్సూరెన్స్ ప్రీమియం 50-70శాతం పెరిగే అవకాశం ఉంది. దీంతో టర్మ్ పాలసీల ప్రీమియమూ పెరగవచ్చు.