కరోనా వల్ల మహిళా ఉద్యోగుల విషయంలో అసమానతలు పెరిగినట్లు ఓ సర్వే వెల్లడించింది. తమ ఎదుగుదల, పదోన్నతులు కరోనా వల్ల పెరిగిన లింగ వివక్షతో ప్రభావితమైనట్లు సర్వేలో పాల్గొన్న 85 శాతం మంది మహిళలు తెలిపారు. 'లింక్డ్ఇన్ ఆపర్చునిటీ ఇండెక్స్ 2021' పేరుతో విడుదలైన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
'ఉద్యోగాల్లో పెరిగిన లింగ వివక్ష' - లింక్డ్ఇన్ ఆపర్చునిటీ ఇండెక్స్ 2021
కుటుంబ బాధ్యతల వల్ల 69 శాతం మంది పని చేసే తల్లులు వివక్షను ఎదుర్కొంటున్నట్లు లింక్డ్ఇన్ తాజా సర్వేలో వెల్లడైంది. కరోనా కాలంలో లింగ వివక్ష పెరిగినట్లు తేలింది.
కరోనాతో పెరిగిన లింగ వివక్ష
సర్వేలోని మరిన్ని వివరాలు..
- కుటుంబ బాధ్యతల వల్ల 69 శాతం మంది పని చేసే తల్లులు వివక్షను ఎదుర్కొంటున్నారు.
- కరోనా వల్ల తమపై ప్రతికూల ప్రభావం పడినట్లు 89 శాతం మంది మహిళలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
- 66 శాతం మంది మాత్రం తమ ముందు తరంతో పోలిస్తే.. లింగ సమానత్వం మెరుగైందని తెలిపారు. అయితే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మాత్రం పని చేసే మహిళల్లో అత్యధిక లింగ వివక్ష భారత్‌లోనే ఉందని సర్వే పేర్కొంది.
- తాము పని చేసే కంపెనీలు పురుషులకు సానుకూలంగా వ్యవహరించడం.. తమ భవిష్యత్ పురోగతి విషయంలో అసంతృప్తికి కారణమని 22 శాతం మంది పని చేసే మహిళలు పేర్కొన్నారు.
- తమకు తక్కువ అవకాశాలు ఉంటాయనే విషయాన్ని 25 శాతం మంది పురుషులు మాత్రమే అంగీకరిస్తున్నట్లు 37 శాతం మంది మహిళలు చెప్పారు.
- ఉద్యోగ భద్రత, ఇష్టమైన పని, వృత్తి, వ్యక్తిగత జీవిత సమతుల్యత.. ఈ మూడూ భారత్‌లో ఉద్యోగం విషయంలో మహిళలు, పురుషులు కోరుకునే ముఖ్యమైన అంశాలు.
- ఇరువురికి ఇలాంటి లక్ష్యాలే ఉన్నా.. జెండర్ ముఖ్యమని ఎక్కువ మంది మహిళలు (63 శాతం) భావిస్తున్నారు.
- ప్రతి ఇద్దరిలో ఒకరి కంటే ఎక్కువ మంది వృత్తిపరమైన సంబంధాలు పెరగాలని, తమ భవిష్యత్‌కు ఉపయోగపడే మెంటర్ అవసరమని భావిస్తున్నారు. సరైన ప్రోత్సాహం, గైడెన్స్ లేకపోవడం అవకాశాలకు ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయని అనుకుంటున్నారు.
ఇదీ చదవండి:ముకేశ్, మస్క్ పోటాపోటీ.. సంపదలో కాదు!