బ్యాంకు ఖాతాదారులంతా అప్రమత్తం కావాల్సిన సమయం ఇది. జులై 1 నుంచి ఏటీఎంలో నగదు ఉపసంహరణ మొదలుకొని.. కొత్త ఐఎఫ్‌ఎస్‌ఎస్ కోడ్ల వరకు ఎన్నో మార్పులు రానున్నాయి. ఏఏ బ్యాంకులు ఏం మార్పులు చేయనున్నాయంటే..
జులై 1 నుంచి వచ్చే మార్పులివే..
ఎస్బీఐ ఛార్జీలు పెంపు
నగదు ఉపసంహరణ సేవల్లో పలు మార్పులు చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తమ బ్యాంకు ఏటీఎంల నుంచి నాలుగు లావాదేవీలు మాత్రమే ఉచితంగా చేసుకునే వీలు కల్పించనుంది. ఆ పరిమితి దాటితే ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ. 15 (జీఎస్టీ అదనం) వసూలు చేయనుంది.
చెక్కులు బాగా వాడతారా?
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్బీఐ.. సేవింగ్స్ ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. చెక్ బుక్ వినియోగంపై పరిమితులు విధించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా 10 చెక్కులను మాత్రమే వాడాలని స్పష్టం చేసింది. ఇంకా కావాలాంటే.. అదనంగా ఛార్జీలు విధించనుంది.
- 10 చెక్స్- రూ.40+ జీఎస్టీ
- 25 చెక్స్- రూ. 75+జీఎస్టీ
సీనియర్ సిటిజన్లకు మాత్రం ఈ నిబంధన వర్తించదు.
యాక్సిస్ బ్యాంకు వినియోగదారులా?
సేవింగ్స్ ఖాతాదారులకు పలు సర్వీస్ ఛార్జీలను పెంచింది యాక్సిస్ బ్యాంకు. ఇప్పటికే వీటిలో కొన్ని మే 1 నుంచి అమల్లోకి రాగా.. సవరించిన మరికొన్ని జులై 1 నుంచి అమలుకానున్నాయి. ఇందులో భాగంగా.. ఎస్ఎంఎస్ అలర్ట్‌కు కూడా డబ్బులు వసూలు చేయనుంది యాక్సిస్ బ్యాంక్. టెలికాం శాఖ ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది.
- ఒక్క అలర్ట్‌కు రూ. 25 పైసల చొప్పున గరిష్ఠంగా నెలకు 25 రూపాయల వరకు ఛార్జీ చేయనున్నట్లు ప్రకటించింది. గతంలో ఇది నెలకు రూ. 5గా ఉండేది.
- ప్రమోషనల్ మెసేజ్‌లు, వన్ టైం పాస్వర్డ్ ఓటీపీలకు ఎలాంటి ఛార్జీ చేయబోమని స్పష్టం చేసింది.
- సేవింగ్స్ అకౌంట్లో ఉండాల్సిన కనీస మొత్తాన్ని కూడా పెంచింది.
దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు అయిన యాక్సిస్ బ్యాంక్‌కు.. 20 కోట్లకుపైగా వినియోగదారులు ఉన్నారు.
సిలిండర్ ధరల పెంపు..
ఎల్పీజీ సిలిండర్ల ధరలు.. ప్రతి నెలా మొదటి రోజే నిర్ణయిస్తారు. ఇంకా అధికారిక ప్రకటన లేనప్పటికీ.. జులై 1 నుంచి ఈ ధరలు పెరుగుతాయని తెలుస్తోంది.
పన్ను చెల్లించలేదా?
గత రెండేళ్లుగా పన్ను చెల్లింపులు చేయని వారికి.. టీడీఎస్ రేట్లు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఇది జులై నుంచే అమల్లోకి రానుంది.