తెలంగాణ

telangana

ETV Bharat / business

'అంచనాలు అందుకుంటేనే 5జీ విజయవంతం' - oppo head interview on 5g

వినియోగానికి రాకముందే 5జీపై అంచనాలు భారీగా పెరిగాయని ఒపో ఆర్​&డీ హెడ్ తస్లీమ్ ఆరిఫ్ పేర్కొన్నారు. ఈ అంచనాలు అందుకుంటేనే 5జీ విజయవంతం అవుతుందని అన్నారు. నెట్‌వర్క్‌ సంస్థలు, మొబైల్‌ ఉత్పత్తిదారులకు ఇదే పెద్ద సవాలని చెప్పారు.

ఒపో ఆర్అండ్ డీ హెడ్
'అంచనాలు అందుకుంటేనే 5జీ విజయవంతం'

By

Published : May 12, 2021, 8:22 AM IST

కొవిడ్‌ నేపథ్యంలో డిజిటల్‌కు ప్రాధాన్య పెరిగింది. అదే సమయంలో మొబైల్‌ నెట్‌వర్క్‌ సంస్థలు 5జీ సాంకేతికతను అందించేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొబైల్‌ తయారీ సంస్థలూ ఈ అవకాశాన్ని అందుకునేందుకు ముందే సిద్ధం అవుతున్నాయని అంటున్నారు ఒపో ఇండియా పరిశోధన, అభివృద్ధి (ఆర్​&డీ) విభాగాధిపతి, వైస్‌ ప్రెసిడెంట్‌ తస్లీమ్‌ ఆరిఫ్‌. వినియోగదారుల అంచనాలను అందుకోవడమే అటు నెట్‌వర్క్‌ సంస్థలూ.. ఇటు మొబైల్‌ ఉత్పత్తిదారులకూ పెద్ద సవాలని పేర్కొంటున్నారు. 'ఈనాడు'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకా ఆయన ఏమంటున్నారంటే...

భారత్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్ల విపణిపై మీ అంచనాలేమిటి? 2021లో ఫోన్ల విభాగంలో ఇది ఎంత వాటాను సాధించే అవకాశం ఉంది?

4జీ మాదిరి కాకుండా వాణిజ్య వినియోగానికి అందుబాటులోకి రాక ముందే 5జీ నెట్‌వర్క్‌పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల కేవలం అధిక వేగంతో కూడిన డేటాను అందించడంపైనే దృష్టి పెడితే సరిపోదు. వినియోగదారులకు ఎలాంటి అనుభూతిని అందిస్తామని హామీ ఇస్తున్నారో దాన్ని నెరవేర్చాలి. కొవిడ్‌-19 పరిణామాలతో డిజిటల్‌కు ప్రాధాన్యం పెరిగింది. కొన్ని అత్యవసర సేవలకు అత్యంత తక్కువ బ్యాండ్‌విడ్త్‌తో కూడిన నెట్‌వర్క్‌ సరిపోతుండగా.. మరికొన్నింటికి ఎక్కువ బ్యాండ్‌విడ్త్‌ అవసరం పడుతోంది. 4జీ కంటే ఎక్కువ ఫైబర్‌ నెట్‌వర్క్‌ అవసరం ఉంటుండటంతో 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కాస్త ఎక్కువగానే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సరైన మౌలిక సదుపాయాలు, వ్యూహాలపైనే సాంకేతికత విజయవంతం కావడం ఆధారపడి ఉంటుంది. అయితే ప్రస్తుతం 5జీ నెట్‌వర్క్‌ ప్రయోగ దశలోనే ఉంది. ఈ కొత్త సాంకేతికత తమకే ముందుగా అందుబాటులోకి వస్తుందనే ఆశాభావం భారతీయ వినియోగదార్లలో నెలకొంది. ఒపో సహా చాలా బ్రాండ్లు 5జీ నెట్‌వర్క్‌ను ఆవిష్కరించే పనిలో ఉన్నాయి. మున్ముందు కూడా ఈ తరహా ఫోన్లే ఎక్కువగా ఉండటాన్ని మనం చూస్తాం.

2021 సంవత్సరానికి 5జీ స్మార్ట్‌ఫోన్ల ప్రణాళికలు ఏమిటి?

ప్రపంచవ్యాప్తంగా సాంకేతికతలో విప్లవాత్మక మార్పులను 5జీ తీసుకొని రానుంది. దీని సాయంతో వివిధ రంగాలు డిజిటలీకరణకు మారడం వేగవంతం అవుతుంది. సాంకేతిక సంస్థలకు రాబోయే 3-5 ఏళ్లను ఓ మంచి అవకాశంగా చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ 5జీ నెట్‌వర్క్‌కు మారేలా గిరాకీని సృష్టించాలన్నదే 5జీ ఫోన్ల తయారీ వెనక ముఖ్య ఉద్దేశంగా ఉండనుంది. మేం కూడా వచ్చే కొన్నేళ్లు పరిశోధన, అభివృద్ధిపరంగా 5జీ నెట్‌వర్క్‌పై ప్రధానంగా దృష్టి పెట్టనున్నాం. ఈ ఏడాది పలురకాల 5జీ ఉత్పత్తులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అధునాతన 5జీ ఆవిష్కరణలు, అప్లికేషన్లపై భారత్‌లోని మా 5జీ ల్యాబ్‌ బృందం పనిచేస్తోంది.

'భారత్‌లో తయారీ'కి సంబంధించి మీ ప్రణాళికలు ఏమిటి?

భారత్‌ విపణిలో వ్యూహాలదే కీలకం. ఇంతకుముందుతో పోలిస్తే ఇక్కడ మేం బలమైన ప్రణాళికతో ఉన్నాం. భారత్‌లో తయారీకి మేం కట్టుబడి ఉన్నామనడానికి నోయిడా సూపర్‌ఫ్యాక్టరీని మేం తీర్చిదిద్దిన తీరే నిదర్శనం. భారత్‌లో ఫోన్ల తయారీ ఆధునీకరణకు ఈ కేంద్రం ఆదర్శంగా నిలుస్తుంది. ప్రస్తుతం ఈ ప్లాంటుకు ఏటా 5 కోట్ల ఫోన్లను తయారుచేసే సామర్థ్యం ఉంది. దీనిని ఇలాగే ముందుకు కొనసాగిస్తూ.. స్మార్ట్‌ఫోన్ల తయారీ భవిష్యత్‌ను మార్చాలనే లక్ష్యంతో ఉన్నాం. నోయిడా ప్లాంటుపై రూ.2,200 కోట్ల పెట్టుబడి, ఎలక్ట్రానిక్‌ మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌కు రూ.3,500 కోట్లు ఇవన్నీ 'భారత్‌లో తయారీ'కి మేం కట్టుబడి ఉన్నామనడానికి నిదర్శనాలే.

భారత్‌లో మొబైల్‌ ఫోన్ల పరిశ్రమపై కొవిడ్‌-19 ప్రభావం ఎలా ఉంది?

కొవిడ్‌-19 రెండో దశలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు పాక్షిక, సంపూర్ణ లాక్‌డౌన్‌ ఆంక్షలు విధిస్తున్నాయి. వీటన్నింటి కారణంగా రానున్న త్రైమాసికాల్లో గిరాకీ తగ్గే అవకాశం ఉంటుందని కౌంటర్‌ పాయింట్‌ సంస్థ పరిశోధన నివేదిక చెబుతోంది. అయితే కొవిడ్‌-19 రెండో దశతో స్వల్పకాలంలో స్మార్ట్‌ఫోన్‌ పరిశ్రమపై ప్రభావం పడినప్పటికీ.. వినియోగదారు అభిరుచుల్లో మార్పులు, వినూత్న సాంకేతికతలకు ప్రాధాన్యమివ్వడం లాంటి ధోరణులు కొనసాగుతాయని మేం భావిస్తున్నాం. ఉద్యోగులకు ఎక్కడి నుంచైనా పనిచేసేందుకు కంపెనీలు వీలు కల్పిస్తుండటంతో విపణుల్లోకి విడుదలయ్యే కొత్త ఉత్పత్తులు, సేవల వైపు వినియోగదారులు మారుతున్నారు. అందువల్ల వచ్చే త్రైమాసికంలో మార్కెట్‌ తిరిగి పుంజుకుంటుందనే నమ్మకంతో ఉన్నాం.

హైదరాబాద్‌లోని 5జీ, పరిశోధన- అబివృద్ధి (ఆర్‌అండ్‌డీ) ల్యాబ్‌ల విస్తరణ ప్రణాళికలేమిటి?

ప్రస్తుతం భారత్‌లోని మా ఆర్‌అండ్‌డీ కేంద్రంలో సుమారు 400 మందితో కూడిన బృందం పనిచేస్తోంది. మా వినియోగదారులకు అద్భుతమైన ఉత్పత్తులు, సాంకేతికతలను అందించేందుకు నిరంతరాయంగా వాళ్లు పనిచేస్తున్నారు. 5జీకి సంబంధించి కీలక సాంకేతికతల అభివృద్ధిపై ఓ ప్రత్యేక బృందం కసరత్తు చేస్తోంది. ఈ ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన సాంకేతికతలను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడం ద్వారా భారత్‌ను ఆవిష్కరణలకు గమ్మస్థానంగా మార్చాలన్నది మా లక్ష్యం. చైనాకు బయట హైదరాబాద్‌లోని ఆర్‌అండ్‌డీ కేంద్రమే మాకు అతిపెద్దది. స్థానిక అభిరుచులకు తగ్గట్లుగా ఉత్పత్తులను అభివృద్ధి చేయడంపై ఇక్కడి బృందం పనిచేస్తుంది. ఈ కేంద్రం విస్తరణను కొనసాగిస్తాం.

ఇదీ చదవండి:కరోనా ఎఫెక్ట్‌.. జీడీపీ అంచనాలు కట్‌

ABOUT THE AUTHOR

...view details