2019 నవంబర్‌లో కొత్త ఉద్యోగాల కల్పన భారీగా పెరిగినట్లు జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది. ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) వద్ద ఉన్న పే రోల్ డేటా ప్రకారం నవంబర్‌లో దేశ వ్యాప్తంగా 14.33 లక్షల ఉద్యోగాల కల్పన జరిగినట్లు తెలిపింది. అంతకు ముందు నెల అక్టోబర్‌లో అది 12.60 లక్షలుగా ఉంది.
1.49 కోట్లు..
గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో కొత్తగా ఈఎస్ఐసీకి చేరిన వారి సంఖ్య 1.49 కోట్లుగా ఉన్నట్లు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్ఓ) తెలిపింది. అదే విధంగా 2017 సెప్టెంబర్ నుంచి 2019 అక్టోబర్ వరకు 3.37 కోట్ల మంది నూతన ఈఎస్ఐసీ సభ్యులు చేరినట్లు తెలిపింది.
ఈఎస్ఐసీ, ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్ఓ), పింఛన్ నిధి నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (పీఎఫ్ఆర్డీఏ)ల్లోని వివిధ సంక్షేమ పథకాల ఉద్యోగుల డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందించింది ఎన్ఎస్ఓ.
2018 ఏప్రిల్ నుంచి నూతన ఉద్యోగుల గణాంకాలు విడుదల చేస్తోంది ఎన్ఎస్ఓ. 2017 సెప్టెంబర్‌కి సంబంధించిన నూతన ఉద్యోగుల గణాంకాలతో ఈ నివేదికలు విడుదల చేయడం ప్రారంభించింది.