ఎవరైనా కార్పొరేట్ కంపెనీల్లో పని చేస్తున్నారంటే వారందరి మధ్య సంభాషణలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. అవి పని వేళలు, షెడ్యూల్, పని- వ్యక్తిగత జీవితం, పనిచేసే వద్ద సమస్యలు, రవాణా, ట్రావెల్ బిల్లుల లాంటివి. ప్రతి ఉద్యోగికి.. ఉద్యోగం పట్ల గౌరవం కన్నా భయం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే ఉద్యోగులు స్నేహంగా మెలుగుతూ ఉత్పాదకతను పెంచేందుకు పలు కంపెనీలు సరికొత్త విధానాలు పాటిస్తున్నాయి. ఇలా ఉద్యోగుల కోసం అత్యుత్తమ పాలసీలు ఉన్న 10 కంపెనీలు, అవి ఉద్యోగులకు అందిస్తున్న వెసులుబాటులేంటో ఇప్పుడు చూద్దాం.
1.కేపీఎంజీ ఇండియా
కేపీఎంజీ ఇండియా సంస్థ తమ ఉద్యోగుల కోసం ఓ ఆసక్తికరమైన పాలసీని పెట్టింది. ఈ సంస్థ తమ ఉద్యోగులను ఎక్కడి నుంచైనా పని చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. అది ఉద్యోగి ఇల్లయినా కావచ్చు, క్లయింట్ కార్యాలయంలోనైనా కావచ్చు. కేపీఎంజీ కార్యాలయంలో ప్రతి రోజు హాజరుకావాలనే నిబంధనేది ఆ సంస్థ విధించలేదు. ఇలా ఉద్యోగులకు పూర్తి స్వేచ్ఛనిస్తూ ఉత్తమ ఔట్పుట్ వచ్చేందుకు ప్రోత్సాహమిస్తోంది. అయితే ఇలా స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఉద్యోగులందరూ వారికిచ్చిన పనిని, వారి మేనేజర్ల పర్యవేక్షణలో సకాలంలో పూర్తి చేయడం మాత్రం తప్పనిసరి.
2.పిలిప్స్ ఇండియా
గురుగ్రామ్ కేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ సంస్థ పిలిప్స్ ఇండియాలో పని చేసే ఉద్యోగులు ఎవరైతే సొంత వాహనాలపై వస్తారో వారి కోసం ఓ వెసులుబాటుని కల్పిస్తోంది. ఎవరికైతే ఆఫీస్ వద్ద పార్కింగ్‌కు స్థలం దొరకదో వారు ఇంటికెళ్లి అక్కడి నుంచే పని చేయొచ్చు. పార్కింగ్ కోసం వెతుకుతూ సమయం వృథా చేయకుండా ఈ వెసులుబాటు కల్పించింది పిలిప్స్ ఇండియా.
3.కోకా కోలా
ప్రముఖ శీతలపానియాల తయారీ సంస్థ కోకా కోలా కంపెనీలో పని చేసే ఉద్యోగులకు పని వేళలు ఫ్లెక్సిబుల్‌గా ఉంచింది. ఈ సంస్థలో పని చేసే ఉద్యోగులు ట్రాఫిక్ బారిన పడకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ట్రాఫిక్ లేని సమయాల్లో ఉదయం 8:30 ప్రాంతంలో ఆఫీస్‌కు వచ్చి సాయంత్రం 5:15 కు తిరిగి ఇళ్లకు వెళ్లే విధంగా వెసులుబాటు కల్పిస్తోంది.
4.ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ)
ఉద్యోగులు సంతోషంగా ఉంటే అంత ఫలవంతంగా వారి నుంచి ఔట్పుట్ వస్తుందని పీడబ్ల్యూసీ నమ్ముతుంది. ఇందుకోసం ఉద్యోగులకు అనుకూలమైన పాలసీలను రూపొందించింది. ఉద్యోగులంతా తమ వ్యక్తిగత జీవితాలను, సంతృప్తికరంగా వృత్తి జీవితాన్ని అనుభవించేందుకు వీలుగా పాలసీలను తీసుకువచ్చింది.
5.మైక్రోసాఫ్ట్
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లోని క్యాంపస్‌లో వారి ఉద్యోగుల కోసం సొంత రవాణా వ్యవస్థను కలిగి ఉంది. బస్సులు, క్యాబ్ సేవలను అందిస్తుంది. మహిళా ఉద్యోగులకు ఈ సంస్థ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ రవాణా వ్యవస్థను కంపెనీనే స్వయంగా పర్యవేక్షిస్తుండటం గమనార్హం.