జూన్ 1 వ తేదీ నుంచి హాల్‌మార్క్ చేసిన బంగారు ఆభరణాలను మాత్రమే జువెలరీ సంస్థలు విక్రయిస్తాయి. ప్రభుత్వం మొదట 15 జనవరి 2020 నుంచి హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేసింది. అయితే కొవిడ్ -19 కారణంగా తలెత్తిన పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని గడువు పొడిగించింది. ఇప్పుడు జూన్ 1 నుంచి బంగారు హాల్‌మార్కింగ్ తప్పనిసరి కానుంది. కొత్త నిబంధనల ప్రకారం.. 14, 18, 22 క్యారెట్‌ల హాల్‌మార్కింగ్‌తో మాత్రమే బంగారు ఆభరణాలను అమ్మవచ్చు. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబిజెఎ) జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా ఇప్పటికే జువెలరీ సంస్థలు పాత స్టాక్‌ను కలిగి ఉన్నందున గడువు పొడగించాలని కోరింది. కానీ, ప్రభుత్వం గడువును పొడిగిస్తుందా లేదా అనేది చూడాలి. అయితే, మీరు బంగారు ఆభరణాలను కొనాలనుకుంటే, హాల్‌మార్క్ ఉన్నవాటిని కొనడం మంచిది.
హాల్‌మార్క్ చేశారో? లేదో? ఎలా ధ్రువీకరించాలంటే..
హాల్‌మార్క్ ఆభరణాలను విక్రయించే సంస్థ తమ ఆభరణాలు లేదా కళాకృతులను హాల్‌మార్క్ చేయడానికి ముందు బీఐఎస్ నుంచి లైసెన్స్ పొందాలి. బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. 24 క్యారెట్ల బంగారం స్వచ్ఛమైనదిగా పరిగణించబడుతున్నప్పటికీ, అది చాలా మృదువుగా ఉంటుంది కాబట్టి ఆభరణాల తయారీకి ఉపయోగించరు. ఆభరణాల తయారీకి అనువైన - 14 , 18 , 22 క్యారెట్లలో ఆభరణాల హాల్‌మార్కింగ్ జరుగుతుంది. 14 క్యారెట్ అంటే 58.5 శాతం స్వచ్ఛతను సూచిస్తుంది (హాల్‌మార్క్ గుర్తు 14K585 గా ఉంటుంది) ఇక 18K 75 శాతం స్వచ్ఛతను సూచిస్తుంది ( హాల్‌మార్క్18K750 ), 22K 91.6 శాతం స్వచ్ఛతను సూచిస్తుంది (హాల్‌మార్క్ 22K916).
హాల్‌మార్క్ చేసిన ఆభరణాలపై మీరు మూడు మార్కులను పరిశీలించాలి- అవి క్యారెట్ స్వచ్ఛత, హాల్‌మార్కింగ్ సెంటర్ గుర్తింపు గుర్తు, ఆభరణాల గుర్తింపు / సంఖ్య.