ఉద్యోగులకు ఆదాయం గురించిన ఆధారాలు సులువుగా లభిస్తాయి. వారి పే స్లిప్, ఫారం-16లు వారికి అవసరమైనప్పుడు ఆదాయ ధ్రువీకరణలుగా ఉపయోగపడతాయి. మరి, స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఎలా? ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తే.. అదే వారికి అధీకృత ఆదాయ ధ్రువీకరణగా మారుతుంది. వ్యక్తులకు రూ.2,50,000లోపు ఆదాయం ఉన్నప్పుడు రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేదు.
గత ఆర్థిక సంవత్సరానికి (2020-21)కి పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయం ఆసన్నమైన నేపథ్యంలో.. పన్ను వర్తించే ఆదాయం లేని వారూ వీటిని సమర్పించడం వల్ల ఉన్న లాభాలేమిటో చూద్దాం..
ఆదాయ ధ్రువీకరణగా
ఉద్యోగులకు యాజమాన్యం ఫారం-16 అందిస్తుంది. అనేక సందర్భాల్లో వారికి ఇదే ఆదాయ ధ్రువీకరణగా పనికొస్తుంది. ఈ ఏర్పాటు లేని వారందరూ సొంతంగా ఐటీ రిటర్నులు దాఖలు చేసుకునేందుకు వీలుంటుంది. తామే సొంతంగా తమ ఆదాయాన్ని తెలియజేసి, ఆ మేరకు రిటర్నులు దాఖలు చేయొచ్చు. ఒక వ్యక్తికి ఎంత ఆదాయం ఉంది.. అతని పొదుపు, పెట్టుబడులు, ఖర్చుల గురించిన పూర్తి వివరాలను ఈ రిటర్నులు తెలియజేస్తాయి.
రిఫండ్ రావచ్చు
ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇతర పెట్టుబడి పథకాలపై వచ్చిన రాబడులకు పన్ను వర్తించే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు.. ఆ మొత్తాన్ని తిరిగి పొందేందుకు రిటర్నులు దాఖలు చేయడం ఒక్కటే మార్గం. మీకు పన్ను వర్తించే ఆదాయం లేనప్పుడు.. మీ నుంచి వసూలు చేసిన మొత్తం పన్నును రిఫండ్ రూపంలో రాబట్టుకోవచ్చు. ఒకవేళ మీ ఆదాయం రూ.2,50,000 మించి ఉన్నప్పుడూ.. కొన్ని మినహాయింపులను క్లెయిం చేసుకోవడం ద్వారా పన్ను వర్తించే ఆదాయం తగ్గిపోతుంది. ఉదాహరణకు పిల్లల ట్యూషన్ ఫీజులు, బీమా పాలసీలు ఉన్నప్పుడు వాటిని సెక్షన్ 80సీ కింద చూపించుకోవచ్చు.