పెరిగిపోతున్న పర్యావరణ కాలుష్యాన్ని నిరోధించేందుకు చాలా దేశాలు విద్యుత్ వాహనాల(ఈవీ) వైపు మొగ్గుచూపుతున్నాయి. అందుకే తమ పౌరులను ఈవీల వైపు మళ్లేలా ప్రోత్సహిస్తున్నాయి. ఇంధనంతో నడిచే వాహనాలతో పోలిస్తే విద్యుత్ వాహనాల ధర చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఫ్రాన్స్‌కు చెందిన వాహన తయారీ సంస్థ 'సిట్రో యెన్' పరిమాణంలో చిన్నది, చౌకైనది అయిన 'అమి' అనే విద్యుత్ కారును రూపొందించింది.
లైసెన్స్ అవసరమే లేదు
ఈ చిన్న విద్యుత్ కారు (అమి) వాస్తవానికి నగర ప్రయాణం కోసం తయారు చేసిన ఫాన్సీ రూఫ్డ్ స్కూటర్లాగా ఉంటుంది. దీనికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఫ్రాన్స్‌లో ఈ వాహనం నడపడానికి కావాల్సిన కనీస వయస్సు 14 ఏళ్లు. మిగతా ఐరోపా దేశాల్లో అయితే 16 ఏళ్లు.
గంటకు 45కి.మీ వేగంతో...
ఈ ఎలక్ట్రిక్ కారులో 5.5 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. దీనిని ఏదైనా 220వి పవర్ అవుట్లెట్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు. పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 3 గంటల సమయం తీసుకుంటుంది. ఫుల్ ఛార్జింగ్ అయిన ఈ వాహనంతో 70 కి.మీ (44 మైళ్లు) వరకు ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్ లాంటి కారు గంటకు 45 కి.మీ వేగంతో ప్రయాణించగలదు.
నగరాల్లో ప్రయాణానికే..
ఈ చిన్న కారు నగరాల్లోని గజిబిజి రోడ్లలో, ఇరుకైన సందుల్లో సులభంగా వెళ్లడానికి ఉపయోగపడుతుంది. దీని పైకప్పు పారదర్శకంగా ఉంటుంది. కారు సైడ్ విండోస్ మాన్యువల్‌గా టిల్ట్ చేయడం ద్వారా తెరచుకుంటాయి.