ఎస్ బ్యాంక్ సంక్షోభంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. బ్యాంకు ఖాతాదారులకు ఎలాంటి నష్టం జరగదని భరోసా ఇచ్చారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు రిజర్వ్ బ్యాంక్ కృషి చేస్తోందని తెలిపారు.
"ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తున్నాం. ఏ ఒక్క డిపాజిటర్‌కు నష్టం జరగదని నాకు ఆర్బీఐ గవర్నర్ హామీ ఇచ్చారు. ఖాతాదారులను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక వ్యవస్థ, బ్యాంకులను కాపాడేందుకే తాజా చర్యలు తీసుకున్నాం. తక్షణ ఉపశమనం కోసం రూ.50వేలను విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఇచ్చాం."
- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
30 రోజుల్లో పరిష్కరిస్తాం..
ఎస్ బ్యాంక్ సమస్యను 30 రోజుల్లోనే పరిష్కరిస్తామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. దేశంలో బ్యాంకింగ్ రంగం స్థిరత్వాన్ని సాధించేందుకే ఎస్ బ్యాంక్‌పై మారటోరియాన్ని విధించామని తెలిపారు.
బ్యాంకింగ్ రంగంలో ప్రక్షాళనకు ఇదే సరైన సమయమని.. త్వరలోనే ఎస్ బ్యాంకును పునరుద్ధరించేందుకు కొత్త పథకంతో ముందుకు వస్తామని హామీ ఇచ్చారు.
డిపాజిటర్ల డబ్బు సురక్షితం..
ఎస్ బ్యాంకు పునరుద్ధరణలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని భారత ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ స్పష్టం చేశారు. ఆర్బీఐ సరైన నిర్ణయాలు తీసుకుందని ఆయన అన్నారు. ఫలితంగా ఖాతాదారుల అందరి డబ్బు సురక్షితంగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి:యెస్ బ్యాంక్‌పై మారటోరియం- సగం వాటా ఎస్బీఐకి!