దక్షిణాది రాష్ట్రాలు తమకు ఎంతో ముఖ్యమైన మార్కెట్ అని తెలిపారు యమహా(Yamaha) మోటార్ ఇండియా ఛైర్మన్ మోటోఫుమి షితార. సరైన సమయంలో యమహా నుంచి విద్యుత్ వాహనాలు(ఈవీలు) తీసుకువస్తామని 'ఈటీవీ భారత్'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. ఆయన ఇంకా ఏమేం విశేషాలు పంచుకున్నారంటే..
కొవిడ్-19 రెండో దశ ప్రభావాన్ని యమహా ఇండియా ఎలా ఎదుర్కొంటోంది?
కొవిడ్-19(Covid-19) రెండో దశ ప్రభావం ఎంతో తీవ్రంగా ఉంది. పరిస్థితులను పూర్తిస్థాయిలో సమీక్షించి తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లోని మా యూనిట్లలో ఉత్పత్తి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలుపుదల చేశాం. కార్పొరేట్ ఆఫీసులోని సిబ్బందికి ఇంటి నుంచి పనిచేసే అవకాశాన్ని కల్పించాం. డీలర్లు, విడిభాగాల సరఫరాదార్లతో నిరంతరం సంప్రదింపులు సాగిస్తూ.. మా వ్యాపార ప్రణాళికలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. వాహన నిల్వల తీరుతెన్నులను విశ్లేషిస్తున్నాం. ప్రస్తుత సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనటానికి కంపెనీలోనే ఒక టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశాం. అదే సమయంలో డిజిటల్ మార్కెటింగ్- విక్రయ విధానాలను విస్తరిస్తున్నాయి. అమెజాన్ వంటి ఆన్‌లైన్ రిటైలింగ్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం.
వినియోగదార్లలో ఏమైనా మార్పులు గమనించారా?
ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వటం, దానికి అనుగుణంగా సొంత వాహనాలు వినియోగించటం పెరిగింది. దీనివల్ల గతంలో ద్విచక్ర వాహనం వద్దనుకున్న వారు కూడా ఇప్పుడు ముందుకు వచ్చి తమకు నచ్చిన వాహనాన్ని సొంతం చేసుకోవటం కనిపిస్తోంది. అది కూడా ఆన్‌లైన్ పద్ధతుల్లో కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు.
మహా వాహనాలకు దక్షిణాది రాష్ట్రాల్లో ఏమేరకు గిరాకీ అధికంగా కనిపిస్తోంది?
మా అమ్మకాల్లో దక్షిణాది రాష్ట్రాల వాటా 45- 50 శాతం వరకూ ఉంటుంది. యమహా(Yamaha) స్కూటర్లు, మోటార్‌సైకిళ్లకు దక్షిణాది రాష్ట్రాల్లో ఆదరణ అధికం. ఫాసినో 125 ఎఫ్‌ఐ, రేజర్ 125 ఎఫ్‌ఐ, రేజర్ స్ట్రీట్ ర్యాలీ స్కూటర్లకు వినియోగదార్ల నుంచి అధిక ఆసక్తి కనిపిస్తోంది. 150 సీసీ శ్రేణిలోని యమహా మోటార్ సైకిళ్లు యువతను ఆకర్షిస్తున్నాయి.