చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి ఎలక్ట్రిక్ కార్ల తయారీపై దృష్టి సారించనుంది. వచ్చే పదేళ్లలో ఈ విభాగంపై సుమారు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ లీ జున్ ప్రకటించారు.
చైనాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రానిక్(ఈవీ) మార్కెట్లో ప్రవేశించేందుకు తీసుకున్న నిర్ణయం అతిపెద్ద మలుపు అని కంపెనీ భావిస్తోంది. ఈ ప్రకటనతో హాకాంగ్ సూచీలో షేరు షియోమి షేరు ధర ఆరు శాతానికి పైగా ఎగసింది.
వచ్చే మూడేళ్లలో మొత్తం 100 బిలియన్ యువాన్లను పెట్టుబడి పెట్టనున్నట్లు షియోమి ప్రకటించింది. దీనిలో 60% కంపెనీ సమకూరుస్తామని.. మిగతా నిధులను బయటినుంచి సేకరించాలనే యోచనలో ఉన్నట్లు తెలిపింది. ఇప్పటికే తమ కార్లలో ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించేందుకు ఇంజినీర్లను సైతం షియోమి నియమించుకుంది. భవిష్యత్‌లో కార్లు మరింత అటానమస్‌గా(స్వయంచాలకంగా) ఉంటాయని భావిస్తోంది షియోమి.
''కార్ల తయారీ పరిశ్రమ గురించి మాకు పూర్తి అవగాహన ఉంది. ప్రపంచంలో విస్తృత మార్కెట్ ఉన్న 'ఈవీ' విభాగంలో చోటు సంపాదించేందుకు ప్రయత్నిస్తాం. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం 'బైడు' వంటి కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ కార్ల నిర్మాణానికి సమాయత్తమవుతోన్న అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. నూతన విభాగమైన ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఉత్పత్తిలోకి ప్రవేశమనేది నా చివరి ప్రయత్నం. ఇదే నా చివరి అంకుర పరిశ్రమ కూడా.''
-లీ జున్, షియోమి సీఈఓ